జిల్లా వ్యాప్తంగా మోడల్ యూనిట్లను స్థాపించాలి…
ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాలలో సభ్యురాలు అయి ఉండాలి…
రుణ బకాయిలను ప్రణాళికాబద్ధంగా వసూలు చేయాలి..
సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
పయనించే సూర్యుడు అక్టోబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం:జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఏపీ ఎంలు (APMs) మరియు సీసీల (CCs) తో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, నాన్ పర్ఫామెన్స్ రుణాలు (NPA), లైవ్‌హుడ్ యూనిట్ల ఏర్పాటు, చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం, మేకల పెంపకం, నాటు కోళ్ల పెంపకం, మహిళా సమాఖ్య గ్రూపుల ఏర్పాటు మరియు వెదురు సాగు వంటి ప్రధాన అంశాలపై సమగ్ర చర్చ జరిగింది.కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని రుణ బకాయిలను ప్రణాళికాబద్ధంగా వసూలు చేయడం అత్యవసరం అని పేర్కొన్నారు. ప్రతి మండలంలో రుణాల స్థితి, ఏ ఊరిలో ఎక్కువ బకాయిలు ఉన్నాయో గుర్తించి, వివిధ నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రుణాల వసూళ్ల కోసం వారికి చివరి అవకాశం గా యూనిట్లను స్థాపించి , సంబంధిత యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని రుణ రికవరీకి ఉపయోగించడానికి ప్రత్యేకప్రణాళికలురూపొందించమని సూచించారు.జిల్లా వ్యాప్తంగా లైవ్‌హుడ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, వాటి కోసం అవసరమైన స్థలాలను గుర్తించమని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సూచించిన విధంగా, చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం, మేకల పెంపకం, నాటు కోళ్ల పెంపకం వంటి యూనిట్లను ఒకే షెడ్లో నిర్వహించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. సమగ్రత వ్యవసాయం ద్వారా, రైతులు మరియు స్వయం సహాయక సంఘాలు అధిక ఆర్థిక లాభాలను పొందగలవని ఆయన స్పష్టం చేశారు.రాబోయే 15 రోజులలో, మొదటి ఐదు రోజుల్లో జిల్లా స్థాయిలో ఒక మోడల్ యూనిట్‌ను, తరువాతి ఐదు రోజుల్లో ప్రతి ఏపిఎం లు మండలంలో ఒక యూనిట్‌ను, చివరి ఐదు రోజుల్లో ప్రతి సీసీలలు మోడల్ యూనిట్లను స్థాపించమని కలెక్టర్ ఆదేశించారు. ఈ విధంగా, అన్ని మండలాల్లో సమానమైన అభివృద్ధి, సమగ్రత వ్యవసాయ విధానాల ప్రాథమిక నమూనాలు రూపొందించబడతాయి.అక్టోబర్ మాసం చివరి నాటికి జిల్లా వ్యాప్తంగా 100 కొర్రమీను చేపల పెంపకం యూనిట్ల స్థాపనకు మహిళా సమాఖ్య గ్రూపులను గుర్తించి వారికి రుణ సహాయం కల్పించేందుకుగాను అవసరమైన అన్ని పత్రాలను బ్యాంకులకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. చేపల పెంపకం యూనిట్ల స్థాపనకు 4.50 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని చేపల పెంపకంతో పాటు కౌజు పిట్టలు నాటు కోళ్లు మరియు మేకల పెంపకం చేపట్టడం ద్వారా అధిక లాభాలు గరించవచ్చని ప్రణాళికాబద్ధంగా వివరించారు.
మహిళా సమాఖ్య సంఘాల కొత్త గ్రూపుల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు త్వరితంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కిషోర్ బాలికలు నుండి పెద్ద మహిళల వరకు ప్రతి ఒక్కరు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండేలా చూడాలని, మహిళలకు సంబంధించిన సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశించారు. సంఘాలలో గ్రూపు సభ్యులుగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను మహిళలకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి జిల్లావ్యాప్తంగా ఉన్న సర్ప్ ఏపీఎంలు, క్లస్టర్ కోఆర్డినేటర్లు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.