
పయనించే సూర్యుడు న్యూస్ : 30 మందికి పైగా అటవిశాఖ అదికారులు, మూడు ట్రాకింగ్ టీమ్స్ , వందల సంఖ్యలో ట్రాప్ కెమెరాలు.. మ్యాన్ ఈటర్ కోసం రెండు నెలలుగా కొనసాగుతున్న ఆపరేషన్ ఎట్టకేలకు సక్సెస్ అయింది. రైతులు , రైతు కూలీలు, పదుల సంఖ్యలో పశువులను పొట్టనపెట్టుకున్న రక్తం మరిగిన బెబ్బులి.. అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపించింది. చివరకు అటవీశాఖ సిబ్బంది శ్రమ ఫలించి బోనులో చిక్కింది. మత్తు ఇంజక్షన్ సాయంతో పెద్దపులిని బంధించింది. ఈ ఘటన మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని పొంబూర్ణ తాలూకాలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా గోండ్ పిప్పిరీ తాలూకాలో ఇద్దరు వ్యవసాయ కూలీలను పొట్టనబెట్టుకున్న బెబ్బులిని మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు బంధించారు. గత అక్టోబరు 18న చెక్ పిపిరీ గ్రామానికి చెందిన బావూజి పాల్, అక్టోబర్ 26న గణేష్ పిపిరీ గ్రామానికి చెందిన అల్కా పెందోన్ అనే రైతులను బలి తీసుకున్న పులిని పట్టుకోవాలంటూ స్థానిక ప్రజానికం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ… పులి పాద ముద్రల ఆధారంగా టైగర్ ట్రాకింగ్ టీమ్స్ ఇచ్చిన సమాచారంతో పొంబూర్ణ తాలుకా అటవీ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ట్రాప్ కెమెరాలకు చిక్కిన పులిని మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎట్టకేలకు బోనులో చిక్కేలా చేసింది. పొంబూర్జ తాలూకా అటవీ ప్రాంతంలో అవినాష్ పూల్ జలే అనే షార్ప్ షూటర్ సహాయంతో పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చిన అటవిశాఖ సిబ్బంది.. ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. మత్తులోకి జారుకున్న పులిని బందించి, చంద్రపూర్ లోని టీటీసీ కు తరలించింది. పట్టుబడ్డ పులి మూడున్నరేళ్ల టీ 115 మగపులి గా గుర్తించారు. అనంతరం టైగర్… ట్రాంజక్ట్ సెంటర్ లో సురక్షితంగా ఉండేలా ఏర్పాటు చేసింది.