రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
పయనించే సూర్యుడు ఏప్రిల్ 19 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి యాసంగి 2024-25 సీజన్ ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ లోని సచివాలయం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ డి. ఎస్. చౌహాన్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో యాసంగి వడ్ల కొనుగోలు, సన్న బియ్యం పంపిణీ, త్రాగునీటి సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ఇందులో భాగంగా యాసంగి సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు కొరకు రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యాసంగి సీజన్ లో 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, రాష్ట్రంలో 8 వేల 329 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీరు, నీడ ఏర్పాట్లు చేయాలని, ఓ. ఆర్. ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, అధికారులు గోదాములలో ఉన్న సన్న బియ్యం నిల్వలను పరిశీలించాలని, నాణ్యత పరిశీలించాలని తెలిపారు. వేసవిలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటి ప్రాజెక్టుల నుండి తరలించడానికి మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అతను కలెక్టర్ విద్యాచందన తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని చౌకధరల దుకాణాల ద్వారా అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి బియ్యం సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేసవిలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మిషన్ భగీరథ పథకంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నల్లా కనెక్షన్ లేని ప్రాంతాలకు వాటర్ ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు , జిల్లా నీటి పారుదల శాఖ ఈ ఈ అర్జున్ రావు , మిషన్ భగీరథ ఈఈ లు తిరుమలేష్, నలిని, పౌరసరఫరాల శాఖ అధికారులు త్రినాథ్ బాబు, రుక్మిణి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.