
పయనించే సూర్యుడు ఆగస్టు 24 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) మాజీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లాను వేదికగా చేసుకుని చేసిన దారుణమైన అబద్ధాలతో కూడిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ తీవ్రంగా తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా గత ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం భావ్యం కాదని అన్నారు. పిఠాపురం పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్ నూకరాజు కుటుంబంలో జరిగిన విషాదకర సంఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. అయితే ఒక తీవ్రమైన నేరాన్ని మరియు ఒక కుటుంబపు వ్యక్తిగత విషాదాన్ని పక్కదోవ పట్టిస్తూ దానిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మతపరమైన అంశాలకు ముడిపెట్టి శవ రాజకీయాలు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నానని తెలిపారు. మరో తొమ్మిది ఉగ్రవాద ముఠాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి పేర్కొనడం ఆధారాలు ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డికి ముందే తెలిస్తే పోలీసులకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. నేరం చేసిన వ్యక్తి ఏ మతానికి లేదా ఏ నేపథ్యానికి చెందినవాడైనా చట్టం దృష్టిలో నేరస్థుడేనని స్పష్టం చేశారు. నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ చేసిన బ్లాక్ మెయిలింగ్ వేధింపులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని అతనిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ఈ వ్యక్తిగత నేరంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని మతాల ప్రజలకు సమాన రక్షణ లభించిందని ఏనాడూ మత మార్పిడులను గానీ అరాచక శక్తులను గానీ పార్టీ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక తీవ్ర నేరానికి మత రంగు పులిమి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూడడం దారుణమని మండిపడ్డారు. ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటనపై పోలీసులు నిష్పాక్షికంగా పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై బురద జల్లడమే ఏకైక లక్ష్యంగా విజయసాయిరెడ్డి ఇటువంటి సంచలన నాటకాలకు తెరలేపారని విమర్శించారు. బాధిత కుటుంబానికి పూర్తి సానుభూతి తెలియజేస్తున్నామని చట్ట ప్రకారం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలే తప్ప శవాలపై పేలాలు ఏరుకునే నీచమైన రాజకీయాలకు దిగవద్దని హెచ్చరించారు.