పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 20. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకొని మన యొక్క సామర్థ్యం నిరూపించుకోవాలి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సహకరిస్తున్న మలబార్ గోల్డ్ చారిటబుల్ సంస్థకు ప్రత్యేక అభినందనలు విద్య ఆడపిల్లలకు అస్తిత్వం అందిస్తుంది ఏ.ఎస్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బాగా చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగి, మరో నలుగురి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ స్థానిక శాంతినగర్ ఏ.ఎస్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 47 మంది ప్రభుత్వ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు కోసం అవసరమైన శిక్షణ, పుస్తకాలు అందించేందుకు మలబార్ గోల్డ్ చారిటబుల్ సంస్థ వారు నగదు ప్రోత్సాహంగా 3 లక్షల 80 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని, ఇందులో కొందరు ఆర్థికంగా స్థిరంగా ఉంటారని, కొందరు పేదరికం లో ఉంటారని, వారిని చూసి స్ఫూర్తి పొంది సమాజంలో అగ్రస్ధాయికి చేరుకునేందుకు బాగా చదువుకోవాలని అన్నారు. మన పుట్టుక, కులం, మతం, ప్రాంతం, చుట్టూ పరిస్థితులు మన చేతిలో ఉండవని, అందుబాటులో ఉన్న విద్యను మనం వినియోగించుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. చదువు వల్ల సమాజంలో మనకు గౌరవం లభిస్తుందని, ముఖ్యంగా ఆడపిల్లలకు విద్య అస్తిత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. పూర్వికులకు దొరకని అవకాశం మనకు లభించిందని, మనకు అందిన ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దని అన్నారు. మనం ఇతరుల కంటే ఎప్పుడు ఒక అడుగు ముందు ఉండాలని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత మరో నలుగురికి సహాయం చేసి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్ధుల విద్యకు ఇబ్బందులు కలగకుండా, సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగి ఇతరులకు తోడ్పాటు అందించాలనే మంచి సంకల్పంతో మలబార్ గోల్డ్ సంస్థ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే 47 మంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన 3 లక్షల 80 వేల రూపాయలను అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. మలబార్ సంస్థ సొంత ప్రాంతమైన కాలికట్ నుంచే తన భార్య కూడా వచ్చిందని , ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనతో అదే విధంగా మనమంతా ఇతరులతో కలిసి ఎదగాలని, ఎవరిని చిన్న చూపు చూడవద్దని కలెక్టర్ పిల్లలకు సూచించారు. మనం ఎదిగే క్రమంలో అనేక మంది నిరుత్సాహపరుస్తారని, దొరికిన దానితో సంతృప్తి చెందమని సలహాలు అందిస్తారని, మనం నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా ప్రణాళిక ప్రకారం క్రమపద్ధతిలో పనిచేస్తూ వెళ్లాలని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని విద్యార్థులతో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన మలబార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులకు కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరావు, అధ్యాపకులు పవన్, భరత్ కుమార్, రాణి, శ్రీనివాస్, కిరణ్, మలబార్ సంస్ధ జిల్లా హెడ్ విష్ణు, మేనేజర్ రామారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.