పయనించే సూర్యుడు, అక్టోబర్ 13( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నారనే వార్తలు, వదంతులు రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు, స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వదంతులను ఖండిస్తూ తంగళ్ళపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు వేములనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, భక్తులు, గ్రామస్థులు కలిసి ఈరోజు నిరసన తెలిపారు. ఆలయ ప్రాంగణంలో “గుడి మూసివేయొద్దు – నిత్యం పూజలు కొనసాగించండి” అంటూ నినాదాలు చేశారు.శ్రీధర్ రావు మాట్లాడుతూ “వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తెలంగాణ భక్తుల ఆధ్యాత్మిక ప్రాణాధారం. ఈ గుడిలో నిత్యం పూజలు గుడిలోనే జరగాలి. ఉత్సవ విగ్రహాలకు భీమేశ్వరాలయంలో పూజలు చేయడం సంప్రదాయానికి విరుద్ధం. ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలి. భక్తుల భావాలను గౌరవించి, ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయకూడదు” అని స్పష్టం చేశారు.అలాగే భక్తులకు దర్శనం సజావుగా కొనసాగేలా చూడాలని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ప్రజల విశ్వాసాలను దెబ్బతీయకూడదని, ఆధ్యాత్మికతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని బీజేపీ నేతలు పేర్కొన్నారు.భక్తులు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొని “రాజన్న గుడి మన గౌరవం – మూసివేయొద్దు” అంటూ నినాదాలు చేశారు