ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
పయనించే సూర్యుడు జూలై 9 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రాజకీయ జీవితంలో ఓటమి ఎరగని నాయకుడిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పేద ప్రజలందరికి స్వర్ణయుగ పాలన అందించిన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన అందరికి ఆదర్శమని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు.
ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణంలోని ఎంజీఆర్ మెమోరియల్ మున్సిపల్ బస్టాండ్ వద్ద గల వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ పూలమాలలతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. అనంతరం ప్రతి ఒక్కరూ పూలుచల్లి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. అనంతరం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు అనంతర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచాయని, ఫీజు రీయంబర్స్ మెంట్, పించను పెంపు, 108, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిన ఆద్యుడు అని పేర్కొన్నారు.ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అనంతరం ఐదేళ్ల పాటు ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ తండ్రిని మించిన తనయుడిలా పేరు తెచ్చుకున్నారని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందచేస్తూ పాలన సాగించారని, సంక్షేమాభివృద్దితో రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపారన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమాలను మరిచి ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని, ఇలాంటి పాలనను ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. ప్రజాభీష్టం మేరకు వారికి పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించాలని, ఇలా చెప్పిన దానికి కట్టుబడే రాజన్న పాలనలా సాగాలని హితవు పలికారు.