పయనించే సూర్యుడు అక్టోబర్ 23 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావైద్య విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి, కళాశాల అన్ని విభాగాలు, వసతులు, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ పరిశీలనలో భాగంగా కలెక్టర్ కలెక్టర్ కొత్తగా నిర్మాణంలో ఉన్న హాస్టల్ వసతి భవనాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్ఎంబీ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య కళాశాల అభివృద్ధి అంటే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అని,వారికి సౌకర్యవంతమైన వసతి, పరిశుభ్రమైన ఆవరణ, ఉత్తమ విద్యా వాతావరణం, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండాలి అన్నారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తు దేశ ఆరోగ్య రక్షణకు పునాది అవుతుంది కాబట్టి కళాశాల అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకోవాలి అని ఆయన అన్నారు.కళాశాల ఆవరణలో పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలను నాటలని, విద్యార్థులలో పర్యావరణ స్ఫూర్తి పెంపొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు సులభంగా కళాశాలకు చేరుకునేలా బస్సు ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసి బస్సు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.వైద్య విద్యార్థులకు మెరుగైన బోధన వాతావరణం కల్పించేందుకు ల్యాబ్లు, లెక్చరర్ గ్యాలరీ, క్లాస్రూములు, లైబ్రరీ వంటి కళాశాల విద్యార్థులకు మెరుగైన బోధన, శిక్షణ అందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై పూర్తి నివేదికను సమర్పించాలనీ, దానిపై ప్రాధాన్య క్రమంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది లెక్చరర్ గ్యాలరీ ఏర్పాటుకు విజ్ఞప్తి చేయగా, దానిని త్వరలోనే అమలు చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.పర్యటనలో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్, డాక్టర్ సురేష్ బాబు వార్డెన్, కోటేశ్వరరావు ఏడిఈ, అధ్యాపకులు, సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.