
పయనించే సూర్యుడు అక్టోబర్ 28 (పొనకంటి ఉపేందర్ రావు)
కొత్తగూడెం: మంగళవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ సదరం క్యాంపును జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపులో దివ్యాంగుల వైద్య పరీక్షలు మరియు ఆన్లైన్ దరఖాస్తుల ఎంట్రీ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. దివ్యాంగులు ఆసుపత్రికి వచ్చిన క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను, సేవల లభ్యతను, నిర్ధారణకు ఉపయోగిస్తున్న పరికరాల పనితీరును కలెక్టర్ సమీక్షించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుందని, ప్రతి దివ్యాంగుడికి అవసరమైన గుర్తింపు మరియు సర్టిఫికేషన్ అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ (UDID) కార్డులు తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా గుర్తింపు పొందుతాయని ఆయన తెలిపారు. ఈ కార్డుల ద్వారా దివ్యాంగులు ఆరోగ్య, విద్య, ఉపాధి, రవాణా వంటి రంగాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందగలరని పేర్కొన్నారు. ప్రతి దివ్యాంగుడు సమాజంలో సమాన హక్కులు, అవకాశాలు పొందేలా ప్రభుత్వ యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కొత్తగా యూడీఐడీ కార్డుల కోసం దరఖాస్తు చేసిన దివ్యాంగులకు ఆసుపత్రిలో వైకల్యం నిర్ధారణ కోసం సదరం స్లాట్ బుకింగ్ చేయాలని, ముందుగానే దరఖాస్తుదారులకు సమాచారం అందించి సమయానికి పరీక్షలు జరిగేలా చూడాలని ఆయన సూచించారు. వైద్య పరీక్షల సమయంలో అవసరమైన వైద్య నిపుణులు, పరీక్షా పరికరాలు, మరియు సాంకేతిక సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అలాగే క్యాంపు ప్రాంతంలో దివ్యాంగులు ఇబ్బంది పడకుండా రిసెప్షన్ సెంటర్, కుర్చీలు, నీడ, తాగునీరు, టాయ్‌లెట్స్, ర్యాంప్, వీల్‌చెయిర్ వంటి ప్రాథమిక వసతులు కల్పించాలని సూచించారు. దివ్యాంగులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలని ఆయన అన్నారు.పరీక్షల అనంతరం ప్రతి దివ్యాంగుడి వైకల్యం శాతం, వ్యక్తిగత వివరాలు మరియు వైద్య నిపుణుల సర్టిఫికేషన్ వివరాలను సమగ్రంగా యూడీఐడీ పోర్టల్‌లో నమోదు చేయాలని, ఎటువంటి లోపాలు లేకుండా డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగుల సమాచారం డిజిటల్ రూపంలో భద్రపరచడం వల్ల భవిష్యత్తులో వివిధ పథకాల అమలుకు అది బలమైన ఆధారంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, వైద్య నిపుణులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.