
పయనించే సూర్యుడు నవంబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలసాధ్యమవుతుందని సమాచార హక్కు కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు.గురువారం సమాచార హక్కు చట్టం దరఖాస్తులపై వచ్చిన అప్పిళ్లను ఆయన పరిశీలించారు అనంతరం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో గ నిర్వహించిన ఆర్టీఐ సమీక్షా సమావేశంలో సమాచార హక్కు చట్టం అమలు, పెండింగ్ కేసుల పరిశీలన, పౌర సమాచార అధికారుల పనితీరుపై ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి విస్తృతంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, వివిధ శాఖల పౌర సమాచార అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతూ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి — “సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి శక్తినిచ్చే కీలక సాధనం అని, ఈ చట్టం ద్వారా మాత్రమే ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన సాధ్యమవుతాయి అన్నారు. అవినీతిని నిర్మూలించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. అందువల్ల ప్రతి అధికారి చట్టంలోని నిబంధనలపై సంపూర్ణ అవగాహనతో పని చేయాలి అని స్పష్టం చేశారు.అధికారులు ప్రజలకు సకాలంలో, సరైన, పూర్తి సమాచారాన్ని అందించడం అత్యవసరమని తెలిపారు. ఆర్టీఐ ద్వారా సమాచారం అందించినప్పుడే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు.గత రెండేళ్లుగా ఆర్టీఐ కమిషన్ నియామకం లేకపోవడం వల్ల అనేక దరఖాస్తులు, అప్పీలు పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు. పెండింగ్ కేసులన్నింటిని వేగంగా పరిష్కరించేందుకు జిల్లాల వారీగా పర్యటన చేపట్టుతున్నామని తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులపై పూర్తి వివరాలు సేకరించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రతి ప్రభుత్వ శాఖలో రికార్డుల నిర్వహణ పద్ధతిని మరింత మెరుగుపరచడం, దరఖాస్తులకు నిర్ణీత గడువులోగా సమాధానం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఆర్టీఐ చట్టం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో అధికారులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.సమావేశంలో పౌర సమాచార అధికారులు తమ శాఖల పరిధిలో ఉన్న కేసుల స్థితిపై వివరాలుకమిషనర్కువివరించారు.భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి శాఖ తమకు వచ్చిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులను సకాలంలో సమాచారం అందించాలని అన్నారు. ప్రతి శాఖ అధికారులు తమ శాఖ పరిధిలో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు వివరాలతో కూడిన రిజిస్టర్ లో పొందుపరచాలని ఆదేశించారు.ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులు తదితరులు పాల్గొన్నారు.