
జీవో 641ను వెంటనే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: బీఆర్ఎస్ సీనియర్ నేత వై. రవీందర్ యాదవ్
( పయనించే సూర్యుడు ఆగస్టు 12 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )కొత్తూరు: గ్రామీణ ప్రాంతాలను కాలుష్య కోరల్లోకి నెట్టే విధంగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్ నేత వై. రవీందర్ యాదవ్ అన్నారు. ప్రజలకు ఉపాధి, అభివృద్ధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం.. వారి ఆరోగ్యానికి ముప్పు కలిగించే నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. సిద్ధాపూర్లో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో కొత్తూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా, నిరసన కార్యక్రమంలో రవీందర్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. డంపింగ్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నాటి నుంచి సిద్ధాపూర్తో పాటు పరిసర గ్రామాల ప్రజలు, గిరిజన తండాల వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి వనరుల కల్పన కోసం భూములను కేటాయిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా డంపింగ్ యార్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. చెత్త డంపింగ్ యార్డు కారణంగా పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధాపూర్లో డంపింగ్ యార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జీవో నంబర్ 641ను రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమాలు, ప్రజా ఉద్యమం కొనసాగుతాయని హెచ్చరించారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జేఏసీ నేతలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు.