
పయనించే సూర్యుడు న్యూస్ :కొడంగల్ నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త. ఇకపై నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా నవంబర్ 14న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఈ పథకం అమలు కానుంది. గత ఏడాది నుంచి అల్పాహారం కూడా అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గంలోని విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్తే. ఇకపై వారికి ప్రతి రోజు మధ్యాహ్నం రుచికరమరైన, నాణ్యమైన భోజనం వడ్డించనున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుచిగా, రుచికరంగా ఉండే మధ్యాహ్నం భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈక్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని.. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ నెల అనగా నవంబర్ 14వ తేదీన కొడంగల్‌లో నిర్మించబోతున్న గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎం రేవంత్‌ను వారు ఆహ్వానించారు. త్వరలోనే కొడంగల్ నియోజకవర్గ పరిధిలోనిఅన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా మధ్యాహ్నం భోజనం సరఫరా కానుంది. దీని కోసం అక్షయపాత్ర ఫౌండేషన్.. కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ కిచెన్ (Greenfield Kitchen) నిర్మించబోతుంది. ఇక్కడ వండిన ఆహారాన్ని నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయనున్నారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతోంది. దీనికోసం ఒక్కో విద్యార్థికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.7 చొప్పున చెల్లిస్తోంది. అయితే నాణ్యమైన భోజనం అందించేందుకు గాను అక్షయ పాత్ర ఫౌండేషన్.. దాదాపు 25 రూపాయలు ఖర్చు చేయనుంది. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం చెల్లించే రూ.7కు అధనంగా అవసరమ్యే నిధులను భరించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. త్వరలోనే నియోజకవర్గం వ్యాప్తంగా అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా భోజనం వడ్డించనున్నారు.ఈక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులతో.. నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. త్వరలోనే ఇది అమలు కానుంది.. ఇదిలా ఉంటే ఇప్పటికే గత సంవత్సరం డిసెంబర్ నుంచి.. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకు బ్రేక్పాస్ట్ అందించే పథకం విజయవంతంగా అమలవుతుంది. నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయాన్నే టిఫిన్ అందిస్తున్నారు. ఈ పథకానికి అన్ని గ్రామాల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ పథకం దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక త్వరలోనే వీరు నియోజకవర్గ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు.