
పయనించే సూర్యుడు ఆగస్ట్ 14 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజక వర్గంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కోటపోలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని పోలీస్, అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి వృక్షాలుగా పెంచినప్పుడే వనమహోత్సవానికి అసలైన ఫలితం ఉంటుందని సూచించారు.వాతావరణ మార్పులు, కాలుష్యాన్ని ఎదుర్కోవాలంటే పచ్చదనం పెంపుపై ప్రజల్లో చైతన్యం అవసరమన్నారు.విద్యార్థులు, యువత పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ ఆధ్వర్యంలో మంగళం పాడు, దామానెల్లూరు తదితర ప్రాంతాల్లోనూ మొక్కలు నాటారు.పాఠశాలలు, గ్రామాలు, ప్రజా ప్రాంగణాలను పచ్చదనంతో నింపేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి.జి.వి. శ్రీనివాసులు, ఎస్సైలు అజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం రాజు పాల్గొన్నారు.పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు.పచ్చని భవిష్యత్తు కోసం మొక్కల సంరక్షణను నిరంతర ఉద్యమంగా కొనసాగించాలని అధికారులు పిలుపునిచ్చారు.