పయనించే సూర్యుడు న్యూస్ 3 ఫిబ్రవరి సిరిసిల్ల టౌన్ రిపోర్టర్ బాలకృష్ణపారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం.అశోక్ కుమార్ స్థానిక ఎన్నికల సన్నద్దత పై అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి రాబోయే స్థానిక సంస్థ గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం.అశోక్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి స్థానిక ఎన్నికల సన్నద్దత పై అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.గ్రామ పంచాయతీలలో 2వ సప్లిమెంట్ ఓటర్ జాబితా నమోదు, మండలాలకు ఎంపిటిసిల కేటాయింపు, ఎంపిటిసి, జడ్పిటిసి ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన మ్యాన్ పవర్ , బ్యాలెట్ బాక్సుల సన్నద్దత , సిబ్బందికి అవసరమైన శిక్షణ, రిటర్నింగ్ అధికారుల నియామకం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాల పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదీర్ఘంగా చర్చించారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం.అశోక్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పంచాయతీ, స్థానిక సంస్థ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎంపీటీసీ పరిధి చెక్ చేసుకోవాలని, ఎంపిడీఓ లు ఈ అంశం పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. మండల స్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ పత్రాలు, బాక్సులు స్ట్రాంగ్ రూమ్ లో అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఎన్నికలు వస్తే చేయాల్సిన పనులను మండల పంచాయతీ అధికారి, ఎంపిడిఓ కలిసి లిస్ట్ ఔట్ చేసుకోవాలని, ప్రతి పనికి ఒక అధికారికి బాధ్యతలు అప్పగించాలని, అవసరమైన సిబ్బంది, మెటీరియల్ వివరాలు అందించాలని ఆయన సూచించారు.ఎంపిటిసి, జడ్పిటిసి ,గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. రిటర్నింగ్ అధికారులుగా నిర్మించబడిన వారికి చేపట్టాల్సిన విధులను వివరిస్తూ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, వారిని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని ఆయన అదనపు కలెక్టర్ లను ఆదేశించారు.అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు వేరువేరుగా ఉంటాయని, స్థానికత పరిస్థితుల ఆధారంగా పోలింగ్ కేంద్రాలను విభజించాలని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రణాళికలు చేసుకోవాలని, ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్స్ ల తరలింపుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల వ్యయ పరిశీలనకు అవసరమైన బృందాలు ఏర్పాటు చేసుకునే సన్నద్ధంగా ఉండాలని అన్నారు.ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఎంపిటిసి ,జడ్పిటిసి ఓటర్ జాబితా తయారు చేయాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 2వ దశ సప్లిమెంట్ ఓటర్ జాబితా తయారు చేయాలని, పోలింగ్ కేంద్రాల ఓటర్లను మ్యాప్ చేయాలని, దివ్యాంగ ఓటర్లకు కల్పించాల్సిన వసతుల పై ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ కార్యదర్శి అందించిన సూచనలను నోట్ చేసుకున్నామని , క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ రాబోయే ఎన్నికలకు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలో మొదటి దశలో 137 గ్రామాల్లో 1188 వార్డులలో, రెండవ దశలో 123 గ్రామాల్లో 1080 వార్డులలో ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించామని, సిరిసిల్ల జిల్లాలో అవసరమైన మేర సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు.ఈ సమావేశంలో ఇన్చార్జి జిల్లా పంచాయితి అధికారి శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్ కుమార్, డిప్యూటి జెడ్పీ సీఈవో గీతా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.