▪అంతిమ దహన సంస్కారాలకు ఆమడ దూరంలో కొత్తపల్లి...
▪అసంపూర్తి నిర్మాణం, సరిపడా నిధులు లేక దహన సంస్కారాలకు గ్రామస్తుల ఇబ్బందులు..
పయనించే సూర్యుడు // జనవరి 22// హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్ (కొత్తపల్లి) : హుజురాబాద్ పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఆ గ్రామానికి ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం అంతిమ సంస్కారాలను నిర్వహించడానికి కూడా సరైన సౌకర్యాలకు గ్రామస్తులు నోచుకోకపోవడం బాధిస్తోంది. గత పదిఏళ్ల క్రితం బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు స్మశాన వాటికను మంజూరు చేయగా సరిపడ నిధులు లేకపోవడంతో అసంపూర్తిగా మిగిలింది. ఆ నిధులతో రెండు చితి పేర్చే గదులను నిర్మించారు. అప్పటి టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకుల రవి కృషితో స్మశాన వాటిక వద్ద బోరు, మోటారు మంజూరు చేయగా ఏర్పాటు చేశారు. అయితే స్మశాన వాటికను రోడ్డుకు లెవెల్ గా నేర్పకపోవడం, చితి గదులను ఎత్తులో ఏర్పాటు చేసి చుట్టూ చెట్లు చెదారం పెరిగి పాములకు, తేళ్లకు ఇతర జంతువులకు విష సర్పాలకు నిలయంగా మారింది. దీంతో గ్రామస్తులు ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలు అక్కడ చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మశాన వాటికకు సుమారు 8 గుంటల స్థలం కేటాయించగా దానికి హద్దులు పెట్టకపోవడం, చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడం, కంకర కుప్పలు, మొరం, రాళ్లు రప్పలు ఉండడంతో అంత్యక్రియలు నిర్వహించాలంటేనే అటువైపు వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. ద్వారము వద్ద పశువులను కట్టేసి పశువుల కొట్టంగా వాడుకుంటున్నారు. ఏపుగా పెరిగిన ముళ్ళ చెట్లు గుంతలతో స్మశాన వాటిక పూర్తిగా నిరుపయోగంగా మారింది. గత ఐదేళ్ల క్రితం కొత్తపల్లి గ్రామం మున్సిపాలిటీలోకి కలువగా నాటి నుండి ఎవరు పట్టించుకోకపోగా, ఏడాది క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అధికారులకు, ప్రజాప్రతినిలకు తెలిపిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కొత్తపల్లి స్మశాన వాటికకు శాశ్వత కాంపౌండ్ వాల్, స్నానాల గదులు, అదనపు బోరును మంజూరు చేసి ప్రజలకు అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అణువుగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
▪సంవత్సరాల కొద్ది తిరుగుతున్న పట్టించుకోవడం లేదు..! -ఆకుల రవి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. కొత్తపల్లి-లొ గత 12 ఏళ్లుగా గ్రామానికి స్మశాన వాటిక కావాలని అధికారుల చుట్టూ తిరిగితే నవమాత్రపు నిధులు మంజూరు చేసి అసంపూర్తిగా నిర్మించి వదిలేశారన్నారు.గత ఐదేళ్లుగా మళ్లీ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని తెలిపారు.కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయగా స్మశాన వాటిక ఎంట్రన్స్ తోరణము, బోరుబావి, మోటారు బిగించడం, రెండు చితి పేర్చే గదులను నిర్మించారన్నారు . చితి గదులకు సమానంగా భూమిని చదును చేయకపోవడం రాళ్లూరప్పలు, ముళ్ళ చెట్లు పెరిగిపోవడం, చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడంతో జంతువులకు, విష సర్పాలకు నిలయంగా మారింది అన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుని అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా నిర్వహించుకునేలా తగిన ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని పేర్కొన్నారు.