పయనించే సూర్యుడు, అక్టోబర్ 21( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ : తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో “కుటుంబానికి మీరు కావాలి” అనే నినాదంతో పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్ఐ ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో ఏఎస్ఐ జాన్, సిబ్బందితో కలిసి రహదారులపై వాహనదారులకు హెల్మెట్ ధారణ యొక్క ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉపేంద్ర చారి మాట్లాడుతూ — రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించడానికి హెల్మెట్ అత్యంత ముఖ్యమని, ప్రతి వాహనదారుడు దీన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. పోలీసులు ఈ డ్రైవ్ ద్వారా ప్రజల్లో భద్రతా అవగాహన పెంపు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ప్రజలకు పత్రికల ద్వారా, మైక్ ప్రకటనల ద్వారా అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు హెల్మెట్ ధారణను అలవాటు చేయాలని, ప్రతి కుటుంబం భద్రతకు ఇది అవసరమని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పోలీసులు రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు తెలిపారు.