
పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా హాట్ టాపిక్ మాత్రం హైదరాబాదే..! తెలంగాణ ఏర్పాటు సందర్భం నుంచి రెగ్యూలర్‌గా వినిపించే ప్రచారం.. యూనియన్ టెర్రిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం జరగుతోంది. దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది. కొంతమంది కుట్రపూరితంగా కావాలని హైదరాబాద్‌పై దుష్ప్రచారాని ఒడిగట్టారని, కేంద్ర ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ అన్నారు. ఈ ప్రచారం వెనక కాంగ్రెస్ పార్టీ ఉందని అనుమానం వ్యక్తం చేసిన వీరేందర్ గౌడ్.. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో దేశంలో అలజడి సృష్టించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ అనే ప్రచారం పూర్తి అవాస్తవమని వీరేందర్ గౌడ్ కొట్టిపారేశారు.హైదరాబాద్ యూటీ అంటూ గతంలోనూ పలుమార్లు ప్రచారం జరిగింది. తెలంగాణ ఏర్పాటు టైంలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. యూటీ చేస్తారన్న ప్రచారం సాగింది. ఆ తర్వాత తొమ్మిదేళ్ల తర్వాత 2023 ఎన్నికల సమయంలోనూ హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రచారం చేస్తున్నాయని బీజేపీ ఖండించింది. పార్లమెంట్ లో అలాంటి ప్రతిపాదనే లేదని కేంద్రం సమాధానం కూడా ఇచ్చింది.ప్రస్తుతం అనేక ఊహాగానాలతో యూటీ ప్రచారాన్ని తీసుకొచ్చారు. కొందరూ రాజకీయ కోణంలో చూస్తే మరికొందరు సెకెండ్ క్యాపిటల్ పర్పస్ అంటూ ఎవరికి నచ్చింది వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటి వింటర్ సీజన్ లో ప్రధాని, కేంద్రమంత్రులు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉంటారని అందుకే కేంద్రం యూటీ చేస్తుందన్న ఫేక్ ప్రచారం సాగుతోంది.మరోవైపు హైదారాబాద్ మహానగరంగా రోజురోజుకు విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో లేటెస్ట్ గా శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో రాష్ట్ర జనాభాలో దాదాపు సగం హైదరాబాద్ లోనే ఉండనుంది. ఓఆర్ఆర్ అవతల ఇండస్ట్రీయల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి టైంలో యూటీ అంటూ తప్పుడు ప్రచారం సాగుతోంది. దీనిని బీజేపీ పార్టీ ఖండించడంతో పాటు హైదరాబాద్ ఎప్పటికే తెలంగాణలో భాగమేనని స్టేట్ మెంట్ ఇచ్చింది.