
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ రాజు అన్నారు మంగళవారం నాడు స్థానిక దేవి గ్రాండ్ హోటల్లో కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన జరుగు దేశ వ్యాపిత సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో పాటు విద్యార్థులు, యువజనలు, మహిళలు, మేధావులు, సామాజిక తరగతులు భాగస్వాములు కావాలని కోరారు. మన దేశ స్వాతంత్ర్యాన్ని ,సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే 500 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని ప్రకటించారని అన్నారు. రష్యా నుండి చమురు కొనుగోలు ఆపి అమెరికా చెప్పిన విధంగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తే కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం అన్యాయమని అన్నారు. ఒకవైపు ఆత్మనిర్భర భారత్ గురించి చెబుతూనే మరోవైపు భారత దేశంలోకి వచ్చే వస్తువులపై సంకాలను పూర్తిగా తొలగించడం ఈ దేశ కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజల జీవితాలను విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడమేనని అన్నారు.ఈ ఒప్పందం అమలు అయితే అమెరికా నుండి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలు, పాలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున మన దేశంలోకి దిగుమతి అవుతాయి. అమెరికాలో వ్యవసాయ రంగానికి అక్కడి ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తుంది. మన మనదేశంలో మన వ్యవసాయ రంగానికి భారత ప్రభుత్వం 3% శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తుంది. మన దేశ వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులతో పోల్చితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు చాలా చౌక. చౌకగా ఉత్పత్తి అయిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ఈ ఒప్పందంతో మనదేశంలోకి విచ్చలవిడిగా వస్తాయి. మన రైతాంగం పండించిన పంటలు అమ్ముకునే దారి లేక దివాళా తీస్తారు. 65% జనాభా ఆధారపడి ఉన్న మన వ్యవసాయ రంగం దివాళా తీస్తుంది. మన దేశం నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల పైన 18 శాతం పన్నులు అమెరికా విధిస్తుంది. మనదేశంలోకి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్ మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు ఎరువుల మీద సబ్సిడీలు తగ్గించి ఎరువులు ధరలు పెంచుతున్నది. 2026-27 కేంద్ర ప్రభుత్వ బడ్జట్ లో ఎరువులపై సబ్సిడీ తగ్గించింది.విత్తన చట్టం, విద్యుత్ చట్టాలలో మార్పులు చేస్తున్నది. విత్తనంపై రైతు హక్కు కోల్పోతాడు. విద్యుత్ చట్టం 2025 ద్వారా స్మార్ట్ మీటర్లు అమల్లోకి వస్తాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఉండదు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దుచేసి, పేదలకు ఉపాధి లేకుండా చేసే 2025 విబి- జీ రామ్ జి చట్టాన్ని తీసుకువచ్చింది. కేంద్రం 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించింది.ఈ విధానాలకు నిరసనగా గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కార్మిక వర్గం నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను గ్రామ, గ్రామాన నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వర్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ శివ ఎన్పిఆర్డి సంఘం జిల్లా అధ్యక్షులు భుజంగారెడ్డి రాజు నాయక్ ఆవాజ్ సంఘం నాయకులు మహమ్మద్ బాబు మహిళా సంఘం నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు..