
పయనించే'సూర్యుడు మే 11 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పేదల కడుపు నింపాల్సిన ప్రభుత్వ ఉచిత రేషన్ బియ్యం ఇప్పుడు బడాబాబుల దందాకు బలవుతున్నట్టు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట మండలాల్లో కొందరు అధికార పార్టీ పేరును అడ్డం పెట్టుకుని రేషన్ డీలర్లను బెదిరిస్తూ టన్నుల కొద్దీ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “మా ఊరు పేరు చెబితేనే జనాలు భయపడతారు.. మమ్మల్ని ఆపే వాళ్లే లేరు” అంటూ కొందరు బహిరంగంగానే విర్రవీగుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు లారీల ద్వారా రాత్రి వేళల్లో అక్రమ రవాణా జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ బస్తాలపై రీసైక్లింగ్ మార్పులు చేసి చట్టానికి చిక్కకుండా స్మగ్లర్లు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని సమాచారం. ముడుపులు తీసుకుంటున్న కొందరు అధికారులు కూడా ఈ మాఫియాకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరు ప్రశ్నించినా రౌడీలతో బెదిరింపులు, దాడులు చేయిస్తున్నారనే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. పేదల బియ్యం మాఫియా చేతిలోకి వెళ్లిపోతుండగా నిజమైన లబ్ధిదారులు ఖాళీ చేతులతో తిరుగుతున్న పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. చట్టం ముందు అందరూ సమానమైతే ఈ అక్రమాలకు అడ్డుకట్ట ఎందుకు పడటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, విజిలెన్స్, సివిల్ సప్లైస్ శాఖలు ప్రత్యేక దృష్టి సారించి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. పేదల కడుపు నింపాల్సిన బియ్యం మాఫియా గోదాముల్లో కాకుండా నిజమైన అర్హుల ఇంటికే చేరేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.