
పయనించే సూర్యుడు మే 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం శివాలయం సమీపంలో శ్రీసిటీలోని టీవీఎస్ కంపెనీ ఉద్యోగులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. ఉదయం విధులకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం సమయంలో బస్సులో పలువురు ఉద్యోగులు ఉండగా, ఐదుగురికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సూళ్లూరుపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం క్షతగాత్రులందరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రమాదంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై సూళ్లూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ స్పందిస్తూ, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు కల్వర్టును ఢీకొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.