

షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
సిద్దాపూర్ లో డంపు యార్డు ప్రతిపాదన విరమించుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే
హాజరైన కాంగ్రెస్ పార్టీ కొత్తూరు మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, సిద్దాపూర్ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్
( పయనించే సూర్యుడు మే 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామ శివారులో ఏకో టౌన్షిప్ పేరుతో భారీ చెత్త డంపు యార్డు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పంచాయతీరాజ్ శాఖ జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ సి.నారాయణ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ఎకో టౌన్షిప్ కు వ్యతిరేకంగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..షాద్నగర్ నియోజకవర్గానికి హైదరాబాద్ జంట జలాశయాలకు అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. సిద్ధాపూర్ పరిసర ప్రాంతాల చెరువులు, కుంటలు గొలుసు కట్టు మాదిరిగా ఉండి వరద నీరు జంట జలాశయాల్లో, మూసీ నదిలో కలుస్తుందని భౌగోళిక పరిస్థితులను వివరించారు. ఇక్కడ చెత్తను డప్పు చేయడం వల్ల వ్యర్ధాలు నాలాల్లో కలిసి చెరువులు, కుంటలను కలుషితం చేస్తూ చివరకు హిమాయత్ సాగర్, గండిపేట చెరువుల్లో కలిసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పైగా స్థానిక పల్లె జీవవైవిద్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి చోట కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు తీసుకుని, చెత్త డంపు కోసం ప్రయత్నాలు సాగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త డంపు కేంద్రం నుంచి సుమారు పది కిలోమీటర్ల పరిధిలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దాపూర్ గ్రామానికి ఆనుకొని ఉన్న మహేశ్వరం మండలం, కందుకూరు ఫ్యూచర్ సిటీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, సిద్దాపూర్ గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్,ఎస్బి పల్లి మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్, పలువురు కార్యకర్తలు ఉన్నారు.