
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమసమాజ స్థాపనే లక్ష్యంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బోయిన్పల్లి, బాలానగర్, మూసాపేట, అల్లాపూర్ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, సకల జనుల ఆకాంక్షలు, త్యాగాలు, ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.గత ప్రభుత్వ పాలనలో ప్రజా ధనం దుర్వినియోగమైందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సంక్షేమ ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, స్వయం సహాయక సంఘాల ద్వారా కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, బస్సుల నిర్వహణ వంటి అవకాశాలను కల్పిస్తోందని వివరించారు.ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రతి పేద కుటుంబానికి గృహ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే సన్నబియ్యం పంపిణీ ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందజేస్తున్నామని, రైతులకు రుణమాఫీతో పాటు బోనస్ అందించామని చెప్పారు. విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడం ద్వారా యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మైనారిటీ, ఎస్సీ సెల్, బీసీ సెల్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.