
పయనించే సూర్యుడు జూన్ 8 (సూళ్లూరుపేట నియోజక వర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్న వందలాది ఆవులు, ఎద్దులు పంట పొలాల్లోకి చొరబడి పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 50 నుంచి 100 వరకు పశువులు పొలాల్లోకి వచ్చి చేతికొచ్చే పంటను మేసివేయడంతో రైతుల శ్రమ వృథా అవుతోంది. ఇప్పటికే వర్షాభావం, సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ పరిస్థితి మరింత భారంగా మారింది. సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంటలను కాపాడేందుకు కొంతమంది రైతులు పశువులను పట్టుకుని కట్టేసినా, వాటి యజమానులు ముందుకు రాకపోవడంతో గోశాలలకు తరలిస్తున్నామని చెబుతున్నారు. పంట కోత సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు రైతులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. వెంటనే అధికారులు స్పందించి పశువుల సంచారాన్ని నియంత్రించడంతో పాటు రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పశువుల యజమానులు కూడా బాధ్యతగా వ్యవహరించి తమ పశువులను అదుపులో ఉంచాలని కోరుతున్నారు. రైతుల కష్టార్జిత పంటను కాపాడేందుకు తక్షణ చర్యలు అవసరమని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు.