పయనించే సూర్యుడు మే 22 (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే చేయడం కోసం లైసెన్సు సర్వేయర్లుగా ఎంపికైన వారికి ఈనెల 26 నుండి జూలై 26 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. కొత్తగూడెం మైనింగ్ కళాశాలలో లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో తరగతి గదులు, డ్రాయింగ్ రూమ్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 426 అభ్యర్థులకు 50 రోజుల పని దినాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ఉదయం 9 గంటలకు క్షేత్రస్థాయిలో శిక్షణ మరియు 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు థియరీ మరియు ప్రాక్టికల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. శిక్షణ కోసం అవసరమైన ప్రొజెక్టర్లు, బోర్డులు తదితర అన్ని పరికరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భూభారతి చట్టం అమలులో సర్వేయర్ల పాత్ర కీలకమని కాబట్టి శిక్షణ తరగతులలో అభ్యర్థులకు భూభారతి చట్టంపై పూర్తి అవగాహన కల్పించాలన్నార ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఉమ్మడి ఖమ్మం జిల్లా మైనింగ్ కళాశాలల ఏడి శ్రీనివాస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ డి.శ్రీనివాస్ మరియు మైనింగ్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.