

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా
మన అంగన్వాడీ మన బాధ్యత అనే ఇతివృత్తంతో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్,ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు కేవలం సేవా కేంద్రాలు మాత్రమే కాకుండా చిన్నారులు,గర్భిణులు,బాలింతల ఆరోగ్యం,పోషణకు కీలక కేంద్రాలన్నారు.కూటమి ప్రభుత్వం అంగన్వాడీ,సమగ్ర శిశు అభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని,గర్భిణులు,బాలింతలు,చిన్నారులకు పౌష్టికాహారం,ఆరోగ్య సేవలు,పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ,పోషకాహార లోపం నివారణ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.ఈ నెల రోజుల పాటు అంగన్వాడీల ద్వారా పోషణ,ఆరోగ్యం,పరిశుభ్రత అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఏ రోజు ఏ ఆహారం అందిస్తున్నారనే వివరాలను ప్రజలకు తెలియజేస్తూ పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు.ప్రతి కుటుంబం అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలని,పిల్లల ఆరోగ్యకర భవిష్యత్తు కోసం మన అంగన్వాడీ మన బాధ్యత అనే స్ఫూర్తితో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి,ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు,మండల పార్టీ అధ్యక్షులు కట్ట సత్తిబాబు, అర్ధాని శ్రీనివాస్, సమగ్ర శిశు అభివృద్ధి అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.