
పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలో ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన భారీ సాండ్ ఆర్ట్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మార్గ్ ఎదురుగా జరిగిన ఈ ఏర్పాట్లు ప్రజాదరణను సంతరించుకుంటున్నాయి. ఈ కళాఖండాన్ని విజయవాడకు చెందిన యువ సైకిత కళాకారుడు, శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ రూపొందించాడు. ఆయన ప్రత్యేకంగా నెల్లూరు నుంచి నాణ్యమైన సాండ్ను తెప్పించి, ట్యాంక్ బండ్ సాగరతీరంపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని రూపొందించడం విశేషం. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో సాండ్ ఆర్ట్ చేయడం ఇదే మొదటిసారి. సాండ్పై సీఎంను ప్రతిబింబించిన తీరు ప్రజలను ఆకర్షిస్తోంది.తెలంగాణ అభివృద్ధి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలకు గుర్తింపుగా ఈ కళాఖండాన్ని అంకితం చేస్తున్నట్టు కళాకారుడు తెలిపాడు. జన్మదిన శుభాకాంక్షల సందేశంగా “హ్యాపీ బర్త్డే టూ సీఎం సార్” అని సాండ్ ఆర్ట్ వద్ద ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకునే సందర్శకులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు పండుగ వాతావరణంలో కనిపిస్తోంది.ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో సీఎం రేవంత్ రెడ్డి పట్ల ఉన్న ఆదరణను ప్రతిబింబించే ప్రయత్నమే ఈ సాండ్ ఆర్ట్ అని తెలిపారు. స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై సాండ్ శిల్పిని అభినందిస్తున్నారు. సీఎం జన్మదిన వేడుకల నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో అభిమానం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుండగా, ట్యాంక్ బండ్పై నిలిచిన ఈ సాండ్ ఆర్ట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించే ప్రధాన ఆకర్షణగా మారింది.