
ఇండియన్ హైట్స్ పాఠశాలలో పేరెంట్స్ సమావేశం
ఇండియన్ హైట్స్ పాఠశాలలో ("NURTURING DREAMS THROUGH PARENTAL") కార్యక్రమం
( పయనించే సూర్యుడు నవంబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఇండియన్ హైట్స్ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్రను చాటి చెప్పేలా("NURTURING DREAMS THROUGH PARENTAL")పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ భువనేశ్వర్, ద్రాక్షాయణి ఆధ్వర్యం వహించగా డైరెక్టర్లు మహేష్, జగదీశ్వర్ సమన్వయ బాధ్యతలు నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సైకాలజిస్ట్ మరియు బిహేవియర్ స్కిల్స్ కోచ్ సుధీర్ సండ్ర తల్లిదండ్రులకు విద్యార్థుల మానసికాభివృద్ధి, ఆత్మవిశ్వాసం మరియు సానుకూల ఆలోచనల ప్రాధాన్యం గురించి వివరించారు.వారు మాట్లాడుతూ… గురువులు జ్ఞానదాతలు మాత్రమే కాదు.జీవన శిల్పులు.పాఠ్యాంశాలు నేర్పడం కాకుండా, పిల్లల మనసులో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సృజనాత్మకత నింపడం వారి ధర్మం. బలహీనతలను గుర్తించి బలాలను పెంచుతారు. తల్లిదండ్రులతో సమాన బాధ్యత పంచుకుంటారు.ఇంట్లో తల్లిదండ్రులు ప్రేమతో మార్గదర్శకులైతే, పాఠశాలలో గురువులు శిస్తుతో, సానుకూలతతో దిశానిర్దేశం చేస్తారు. ఈ రెండు శక్తుల సమ్మేళనంలోనే విద్యార్థి సమగ్ర వికాసం సాకారమవుతుంది.గురువులు పిల్లల్లో కలలు నాటుతారు, పెంచుతారు, నిజం చేస్తారు. ఒక మంచి గురువు ఒక విద్యార్థిని మాత్రమే కాదు.మంచి పౌరుడిని,నాయకుడిని,సమాజ సేవకుడిని తీర్చిదిద్దుతాడు.పిల్లలకు మొబైల్స్‌కు చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా జాగ్రత్తపడాలి.మొబైల్స్ వాడకంలో అధిక సమయం కేటాయించడం వారి దృష్టి, జ్ఞాపకశక్తి, ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు మొబైల్స్‌ను పిల్లలకు దూరంగా ఉంచి, వారికి సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు.అదే సమయంలో సుధీర్ తల్లిదండ్రులకు ఆత్మస్థైర్యం పెంపొందించే విధంగా వ్యవహరించాలని, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారి ఎదుగుదల కోసం ప్రణాళికాబద్ధంగా నడిపించాలని సూచించారు.పిల్లలపై ఒత్తిడి కాకుండా, ప్రోత్సాహం చూపించండి. చిన్న విజయాలను కూడా గుర్తించి ప్రశంసించండి. అది వారి జీవిత దిశను మార్చేస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఎక్సలెన్స్, ఫన్ లెర్నింగ్ టెక్నిక్స్, కెరీర్ గైడెన్స్, గోల్ సెట్టింగ్, మోటివేషన్, క్రియేటివ్ థింకింగ్ వంటి అంశాలపై సవివరంగా చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా చైర్మన్ భువనేశ్వర్, ద్రాక్షాయణి మాట్లాడుతూ…ఇండియన్ హైట్స్‌లో విద్యార్థుల విద్యతో పాటు విలువల పెంపు కూడా మా ప్రధాన లక్ష్యం. తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారా పిల్లలలో నైపుణ్యాలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు.తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై పాఠశాల కార్యక్రమాలకు తమ మద్దతు తెలియజేశారు. పాఠశాల కరస్పాండెంట్ విశ్వేశ్వర్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ హైట్స్ పాఠశాల విద్యతో విలువలు, క్రమశిక్షణతో భవిష్యత్తు నిర్మాణానికి ఆలయమని యాజమాన్యం స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, మోటివేషన్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.