
పయనించే సూర్యుడు న్యూస్ : దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీలో జరిగిన పేలుడు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఊహించని పరిణామం అందరిలో భయబ్రాంతులకు గురి చేసింది. ఈ సందర్భంగా ఎర్రకోటను నవంబర్ 11 నుండి నవంబర్ 13వ తేదీ వరకు మూడు రోజులపాటు సందర్శకుల కోసం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపైన దర్యాప్తు జరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించడానికి భద్రతను సమీక్షించడానికి వీలుగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు తాత్కాలికంగా మూసివేతను ప్రకటించింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత నవంబర్ 13 తర్వాత తిరిగి ఎర్రకోటను తెరిచే విషయంపైన అప్పటి పరిణామాల తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఢిల్లీలో జన సమర్థం ఎక్కువగా ఉండే చాందిని చౌక్ వంటి ప్రాంతాల్లో కూడా భద్రతా కారణాల దృష్ట్యా మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నారు. మూడు రోజుల పాటు చాందిని చౌక్ ను మూసివేయనున్నారు. అన్ని మతాలకు చెందిన ప్రాంతంగా, ఢిల్లీకి చెందిన వారికి ఢిల్లీకి వచ్చిన వారికి షాపింగ్ చేయడానికి మంచి ప్రదేశంగా ఉండే చాందిని చౌక్ ప్రాంతాన్ని మూడు రోజుల పాటు మూసి వేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడులో 9 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు తీవ్రంగా చేస్తున్నారు. ఢిల్లీ అంతా అలర్ట్ చేశారు.