
పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలో పేలుడు ఘటన వెనక ఉన్నవారిని చట్టం ముందు నిలబెడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ దాడిని భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన కోసం భూటాన్‌కు వెళ్లారు. భూటాన్ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఢిల్లీ పేలుడు ఘటనపై తొలిసారిగా బహిరంగంగా స్పందించార. ‘‘ఈరోజు నేను చాలా భారమైన హృదయంతో మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకర ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ రోజు మొత్తం దేశం వారితో నిలుస్తుంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని సంస్థలతో నేను నిన్న రాత్రంతా సంప్రదింపులు జరిపాను. ఈ కుట్ర వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలము. వారందరినీ చట్టం ముందు నిలబెడతాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ఈ ఘటనకు సంబంధించి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ... ఢిల్లీ పేలుడు ఘటనపై దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు వేగంగా, సమగ్రంగా విచారణ నిర్వహిస్తున్నాయని, బాధ్యులను వదిలిపెట్టబోమని తెలిపారు. దర్యాప్తు వివరాలు త్వరలో బహిర్గతం చేస్తామని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘నిన్న ఢిల్లీలో జరిగిన విషాద సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ తీవ్ర దుఃఖంలో మృతుల కుటుంబాలకు బలం, ధైర్యాన్ని ప్రసాదించాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఈ సంఘటనపై త్వరితంగా, సమగ్రంగా విచారణ జరుపుతున్నాయని ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తున్నాను. దర్యాప్తు ఫలితాలు త్వరలో వెల్లడిస్తాం. ఈ విషాదానికి కారణమైన వారిని న్యాయం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టబోమని నేను దేశానికి అధికారికంగా హామీ ఇస్తున్నాను’’ అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
ఢిల్లీ పేలుడు ఘటన... పెరిగిన మృతుల సంఖ్య... ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న ఐ20 కారులో సోమవారం సాయంత్రం 6.52 గంటలకు శక్తివంతమైన పేలుడు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారని, మరో 20 మంది గాయపడ్డారని అధికారులు సోమవారం రాత్రి వరకు తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడినవారిలో మరో ముగ్గురు మరణించారని పోలీసులు మంగళవారం తెలిపారు. దీంతో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది.