
*మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్*
పయనించే సూర్యుడు, నవంబర్ 06, అశ్వాపురం: భద్రాచలం సీఐ సట్ల రాజును అశ్వాపురం గ్రామ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సదర్ లాల్ మాట్లాడుతూ సీఐ సట్ల రాజు గతంలో అశ్వాపురం మండలానికి అందించిన సేవలను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో అప్పటి అశ్వాపురం సర్పంచ్ బానోత్ శారద, ఎంఆర్ఓ భగవాన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, డాక్టర్ మణికంఠతో కలిసి సీఐ సట్ల రాజు ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. కరోనా బారిన పడిన వారిని క్వారంటైన్లో ఉంచడం, వైరస్ వ్యాప్తిని అరికట్టడం, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం కృషి చేశారని కొనియాడారు.అదేవిధంగా అశ్వాపురం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం విధులు నిర్వహించారని పేర్కొన్నారు.గతంలో సీఐ సట్ల రాజు బదిలీ అయిన సమయంలో అప్పటి సర్పంచ్ బానోత్ శారద ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారని గుర్తుచేశారు. ఆయన అందించిన సేవలకు, ప్రజలతో ఏర్పరచుకున్న ఆత్మీయ అనుబంధానికి నిదర్శనంగా మండలంలోని 24 గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు వరుసగా 24 రోజుల పాటు ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ప్రజల నుంచి లభించిన అపారమైన అభిమానం, ఆదరణతో ఆయన 24 రోజుల పాటు రిలీవ్ కాకుండా అక్కడే ఉండాల్సి వచ్చిందని గుర్తుచేశారు.ఒక పోలీసు అధికారి బదిలీ అయినప్పటికీ 24 రోజుల పాటు వరుసగా సన్మానాలు అందుకోవడం సాధారణ విషయం కాదని, అది ఆయన ప్రజలకు అందించిన సేవలకు, సంపాదించుకున్న గౌరవానికి, ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన స్థానానికి నిదర్శనమని సర్పంచ్ సదర్ లాల్ ప్రశంసించారు.ప్రస్తుతం భద్రాచలం సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న సట్ల రాజు భద్రాచలం ప్రాంత అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు మరింత కృషి చేసి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. సీఐ స్థాయి నుంచి మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మరిన్ని సేవలు అందించాల ని సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మనస్ఫూర్తిగా అభిలషించారు.