
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో 10 గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. ముధోల్ మండలంలోని విట్టోలి, బ్రాహ్మణగావ్, కరెగాం, బోరెగాం, చింతాకుంట, చింతాకుంట తండా, ఎడ్బిడ్ తండా, ఎడ్బిడ్, వెంకటాపూర్, చించాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2,441 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. మార్కెట్లో ధాన్యం ధరలు తగ్గినప్పుడు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అలాగే సన్నరకాల ధాన్యానికి క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. రైతు భరోసా నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.