
కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ధ్వజం
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్ముకుంటోందంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ భూముల వ్యవహారాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావుకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.శుక్రవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన విమర్శలకు సమాధానంగా శనివారం కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హేమదుర్గ భవన్లో బండి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే ముందు బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని స్పష్టం చేశారు.బంగారు తెలంగాణ పేరుతో అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై సుమారు రూ.8.5 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని బండి రమేష్ ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల విషయంలో ఎమ్మెల్యే కృష్ణారావు, ఆయన అనుచరుల పాత్రపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.హౌసింగ్ బోర్డు అభివృద్ధి కోసం తాను రూ.2 వేల కోట్లు ఖర్చు చేశానని ఎమ్మెల్యే కృష్ణారావు చెప్పుకోవడంపై రమేష్ ప్రశ్నలు సంధించారు. నిజంగా అంతటి అభివృద్ధి జరిగితే అందుకు సంబంధించిన వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో కనీసం ఒక పాఠశాల, ఒక ఆసుపత్రి నిర్మించలేక గత ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. పాఠశాల నిర్మాణం కోసం తీసుకొచ్చిన స్టీల్‌ను సైతం బీఆర్ఎస్ నాయకులు అమ్ముకున్నారని ఆరోపించారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాధవరం కృష్ణారావు తన 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కూకట్పల్లి నియోజకవర్గానికి గుర్తుండిపోయేలా చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని బండి రమేష్ ప్రశ్నించారు. ముఖ్యంగా పేద ప్రజల కోసం ఎన్ని ఇళ్లు నిర్మించారో లెక్కలతో సహా వెల్లడించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఐటీ, పారిశ్రామిక, ఉత్పాదక రంగాల్లో ముందంజ వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాల్లో కరువు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ప్రకృతి వైపరీత్యాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారని తెలిపారు.పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని బండి రమేష్ వెల్లడించారు. హౌసింగ్ బోర్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 11 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, ఇప్పటికే 400 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రెండో విడతలో మరో 3 వేల ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో తాను, సంబంధిత అధికారులు నిరంతరం పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని చెప్పారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు పక్కనపెట్టి ప్రజలకు చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని, ఆరోపణలు చేసే నాయకులు వాస్తవాలతో ప్రజల ముందుకు రావాలని బండి రమేష్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. పేద ప్రజల సంక్షేమం, కూకట్పల్లి సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.