
పయనించే సూర్యుడు న్యూస్ : దొంగతనం చేయడానికి వెళ్లి అడ్డంగా దొరికిపోతే ఎలా ఉంటుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఢిల్లీలో కదులుతున్న రైలులో ప్రయాణికుల వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుల నుంచి వస్తువులు లాక్కోవడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన ప్రయాణికులు అతడి చేతిని గట్టిగా పట్టుకున్నారు. రైలు వేగంగా వెళ్తున్నప్పటికీ విడిచిపెట్టకుండా అదుపులో ఉంచడంతో నిందితుడి శరీరంలో కొంత భాగం కిటికీ బయట వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన 94 సెకన్ల వీడియోను శర్మ జీ (@Sharmaji2772) అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
వీడియోలో రైలు వేగంగా వెళ్తుండగా కోచ్‌లో ప్రయాణికులు గుమిగూడి ఉండటం కనిపిస్తోంది. కిటికీ పక్కన ఉన్న వ్యక్తి బయట ఉన్న నిందితుడి చేతిని పట్టుకోగా, ఇతర ప్రయాణికులు కూడా అతడికి సహకరించారు. నిందితుడు విడిపించుకునేందుకు ప్రయత్నించినా ప్రయాణికులు వదల్లేదు. ఈ క్రమంలో రైలు ఢిల్లీ స్టేషన్లో దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామంటూ ఓ వ్యక్తి వీడియోలో చెబుతున్నట్లు వినిపిస్తోంది.
తర్వాతి స్టేషన్ వరకు ఉత్కంఠ.. రైలు తదుపరి స్టేషన్‌కు చేరుకునే వరకు ప్రయాణికులు నిందితుడిని పట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే, అతడిని ఏ స్టేషన్లో పోలీసులకు అప్పగించారు? కేసు నమోదైందా? అనే వివరాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం అందుబాటులో లేదు.
నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు.. ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. దొంగతనాన్ని అడ్డుకున్న ప్రయాణికుల ధైర్యాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు కదులుతున్న రైలు నుంచి వ్యక్తిని వేలాడదీయడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టుతప్పి ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని అభిప్రాయపడుతున్నారు. నేరాన్ని అడ్డుకోవడం ముఖ్యమే అయినప్పటికీ, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలకు ప్రమాదం కలిగించే చర్యలకు బదులుగా రైల్వే పోలీసులకు (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.