
పయనించే సూర్యుడు .16.11.2026 నిర్మల్ జిల్లా బ్యూరో అర్హులందరికీ పింఛన్ లు అందే విధంగా తన వంతుగా సహకరిస్తానని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. సోమవారం బైంసా మండలంలోని వంశి రెడ్డి ఫంక్షన్ హాల్ లో చేయూత పథకం కింద ఎంపికైన వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు బైంసా మండలంలోని అన్ని గ్రామాలకు కలిపి 637 మందికి పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పింఛన్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. గత పది సంవత్సరాలుగా పింఛన్లు అందక పేద ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. అర్హులైన వారికి పింఛన్ మంజూరు కాకుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశం తో ముధోల్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో మరో రెండు సంవత్సరాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నట్లు చెప్పారు. బతుకుతెరువు కోసం కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, కొనుక్కున్నవారికి పింఛన్లు తిరస్కరించడాన్ని ఆయన తప్పుపట్టారు. వారందరికీ పింఛన్లు ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గంలో 4606 మందికి పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి ఎంపికైన పింఛన్ దారులు తరలి రావడం తో ఫంక్షన్ హాల్ మొత్తం జనసంద్రంతో నిండిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నీరజ్ కుమార్ తో పాటు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు నాయకులు పాల్గొన్నారు.