
షాద్‌నగర్ నియోజకవర్గంలో రూ.25.07 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, చేయూత పింఛన్ల పంపిణీ ( పయనించే సూర్యుడు నవంబర్ 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) 23వ విడత కింద 62 మంది లబ్ధిదారులకు రూ.25,07,500 విలువైన చెక్కులు, కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందన్నారు. మండలాల వారీగా షాద్‌నగర్ పట్టణంలో 10 మందికి రూ. 6.44 లక్షలు, కేశంపేటలో 12 మందికి రూ.4.66 లక్షలు, ఫరూఖ్‌నగర్‌లో 15 మందికి రూ.4.57 లక్షలు, కొత్తూరులో 8 మందికి రూ.3.09 లక్షలు, జిల్లేడ్-చౌదరిగూడలో 6 మందికి రూ.2.17 లక్షలు, నందిగామలో 7 మందికి రూ.2.07 లక్షలు, కొందుర్గులో 4 మందికి రూ.2.06 లక్షల చొప్పున నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. పదేళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులకు ఒక్క మండలంలోనే దాదాపు వెయ్యి కొత్త చేయూత పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. పార్టీలకు అతీతంగా ఉచిత బస్సు, గృహజ్యోతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, సింగిల్ విండో చైర్మన్ చల్ల శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాయికల్ శ్రీనివాస్, బాలరాజు గౌడ్, ఆగిర్యాల కృష్ణారెడ్డి, జాంగారి రవి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.