
పయనించే సూర్యుడు న్యూస్ :అటల్ పెన్షన్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం అందించే ఒక సామాజిక భద్రతా పథకం. ఈ పథకాన్ని ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాల కోసం రూపొందించింది. ఈ పథకంలో భారతీయ పౌరులై ఉండాలి. అలాగే ఆదాయపు పన్ను చెల్లించని వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పథకంలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరిన వారికి పదవీ విరమణ వయస్సు లేదా 60 ఏళ్ల తర్వాత నెలకు ఖచ్చితమైన కనీస పెన్షన్ లభిస్తుంది. ఇందులో భాగంగా రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000గా పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల వయస్సు పూర్తయినప్పటి నుంచి పెన్షన్ లభిస్తుంది. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నియంత్రిస్తుంది.ఈ పథకం మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా ఎంచుకున్న మొత్తానికి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇది పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఒకవేళ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే.. ఆ తర్వాత, వారి జీవిత భాగస్వామికి కూడా అదే పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. ఒకవేళ జీవిత భాగస్వామి కూడా మరణిస్తే.. నామినీకి పెన్షన్ కార్పస్ అనగా పెట్టుబడి మొత్తం తిరిగి చెల్లిస్తుంది.అయితే పెన్షన్ ప్రారంభమైన తర్వాత ఈ పథకంలో చేరిన వ్యక్తి లేదా జీవిత భాగస్వామి మరణిస్తే నామినీకి పెన్షన్ కార్పస్ లభిస్తుంది. ఉదాహరణకు రూ.1,000 పెన్షన్ కోసం చేసుకుంటే రూ.1.7 లక్షలు, రూ.5,000 పెన్షన్ కోసం రూ.8.5 లక్షలు గరిష్టంగా అందనుంది. అలాగే ఈ పథకం కింద చేసిన సహకారాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ (1బీ) పరిధిలోకి వస్తాయి. ఇది ప్రభుత్వం నుంచి మద్దతు గల పథకం. ఇతర మార్కెట్ ఆధారిత పథకాలతో పోలిస్తే ఇందులో రిస్క్ తక్కువగా ఉంటుంది.