
పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలోని లాల్ క్విలా మెట్రో స్టేషన్‌ను భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూసివేశారు. లాల్ క్విలా మెట్రో స్టేషన్ సమీపంలో ఇటీవల జరిగిన ఆత్మాహుతి పేలుడు ప్రభావంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పేలుడు సంఘటన తర్వాత భద్రతాపరమైన అప్రమత్తత, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్టేషన్ మూసివేశారు. అనంతరం తదుపరి నోటీసు వచ్చేవరకు లాల్ క్విలా మెట్రో స్టేషన్లో ప్రవేశం, నిష్క్రమణ నిలిపివేశారు. అయితే మిగతా అన్ని మెట్రో స్టేషన్లు యథావిధిగా నడవనున్నాయి. కాగా, ఈ వైలెట్ లైన్లో రైళ్లు లాల్ క్విలా స్టేషన్‌ను దాటి వెళ్లనున్నాయి. ప్రయాణికులు సమీపంలోని జామా మసీదు మెట్రో స్టేషన్ లేదా చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ వంటి ప్రత్యామ్నాయ స్టేషన్లను ఉపయోగించుకోవాలని ఆదేశాలు జరీ చేశారు. ఇదిలా ఉండగా, ఈ పేలుడులో 12 మందికి పైగా మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం, పేలుడు తీవ్రతకు వారి అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయి. పేలుడు జరిగిన హ్యుందాయ్ ఐ20 కారు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు చుట్టుపక్కల ఆరు కార్లు, రెండు ఈ-రిక్షాలు, ఒక ఆటో రిక్షా సహా దాదాపు 12 వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ పేలుడు శబ్దం చాలా దూరం వరకు వినిపించగా.. ఈ ధాటికి 500 మీటర్ల పరిధిలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి.ఢిల్లీతో పాటు ముంబై, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాలు, ముఖ్యమైన ప్రదేశాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగానే భద్రతా కారణాల దృష్ట్యా లాల్ క్విలా మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది. ఈ పేలుడును ఉగ్రవాద చర్యగా ప్రభుత్వం ప్రకటించింది.