
పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇవాళ పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2027 ఏడాదిలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారని, 2029లో మళ్లీ అధికారంలోకి వస్తారని అన్నారు.“గతంలోనూ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే సంకల్పంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని పాలనలో వాటిని తీర్చిన నాయకుడు వైఎస్ జగన్. పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని 100 రోజుల్లోనే వైఎస్ జగన్ అమలు చేశారు.పేదరికాన్ని పోగొట్టాలనే లక్ష్యంతోనే జగన్ పాలన కొనసాగించారు. మెరుగైన విద్య, వైద్యమే ధ్యేయంగా జగన్ పాలన సాగించారు. జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను చంద్రబాబు చిదిమేస్తున్నారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ప్రైవేటుకి ఇచ్చేస్తున్నారు.అన్ని మెడికల్ కాలేజీలు ఉంటే పేదవారికి వైద్యంతో పాటు వైద్యవిద్యా దక్కేది. పెత్తందారీ మనస్తత్వంతో చంద్రబాబు పాలన చేస్తున్నారు. రెండేళ్లు పాలన పూర్తి అవ్వకుండానే చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. మనుషులను చంపే అలవాటు వాళ్ల తండ్రిది అని లోకేశ్ తెలుసుకోవాలి. కందుకూరు, గుంటూరులో తొక్కిసలాట లో జనాలని చంపలేదా? దేవుడి దర్శనానికి వస్తుంటే డైరెక్టుగా దేవుడి దగ్గరకి పంపేస్తున్నారు. దేవాలయాల్లో తొక్కిసలాటలు జరిగి పదుల్లో అమాయకులు చనిపోతున్నారు.ఏపీ ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే.. భార్యాపిల్లలతో లోకేశ్ క్రికెట్ చూడ్డానికి వెళ్లారు సిగ్గులేదా? అధికారంలో ఉంటే ఎవరైనా అటువంటి కార్యక్రమాలకు రానిస్తారు. క్రికెట్ చూడ్డానికి వెళ్లి అమిత్ షా కొడుకు తెలుసని బిల్డప్ ఇచ్చుకున్నారు” అని చెప్పారు.