
ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కమిటీ పయనించే సూర్యుడు నవంబర్ 24 నిర్మల్ జిల్లా బ్యూరో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంపత్ కుమార్ మరణం అత్యంత బాధాకరం. తండ్రి లేని నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, ఎన్నో ఆశలతో చదువుకుంటున్న ప్రతిభావంతుడైన విద్యార్థి ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆయన కుటుంబానికి ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. అయితే, ఈ ఘటనపై కనీస విచారణ కూడా పూర్తికాకముందే, సంపత్ ఆన్లైన్ బెట్టింగ్ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేయడం సరికాదు. విద్యార్థుల మరణాలకు గల అసలు కారణాలను పక్కదారి పట్టించి, బాధితులపైనే నింద వేసే ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ నిజంగానే నిషేధిత బెట్టింగ్ యాప్ల ప్రమేయం ఉంటే, క్యాంపస్ పరిధిలో అవి విద్యార్థులకు ఎలా అందుబాటులోకి వస్తున్నాయో అధికారులు, సైబర్ క్రైమ్ పోలీసులు సమాధానం చెప్పాలి. వేలాది మంది విద్యార్థులు ఉంటున్న బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మానసిక ఒత్తిడిని గుర్తించే కౌన్సెలింగ్ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యమైందో అర్థం కావడం లేదు. హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ లోపం, సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్లే క్యాంపస్లో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కమిటీ ప్రధాన డిమాండ్లు: విచారణ పూర్తికాకముందే బాధిత విద్యార్థి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారాన్ని తక్షణమే ఆపాలి. సంపత్ మృతి వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసేందుకు తక్షణమే నిష్పక్షపాత, సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలి. క్యాంపస్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం పూర్తిస్థాయి కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, హాస్టళ్లలో పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలి.
ఇంటికి పెద్దదిక్కు కావాల్సిన కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సంపత్ తల్లికి, కుటుంబానికి ప్రభుత్వం మరియు యూనివర్సిటీ తక్షణమే ఆర్థిక సాయం అందించి అన్ని విధాలా ఆదుకోవాలి అని అన్నారు.