
---అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ బానోత్ సదర్ లాల్
పయనించే సూర్యుడు, నవంబర్ 27,అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీవో ముత్యాలరావు సందర్శించి, నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో ముత్యాలరావు మాట్లాడుతూ ఆన్లైన్ నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలు జరగకుండా జాగ్రత్తగా వివరాలను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఆన్లైన్ నమోదులో ఏవైనా ఎర్రర్స్ వచ్చినా, లబ్ధిదారులకు మెసేజ్‌లు అందకపోయినా వారి వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని, రేషన్ కార్డులో సింగిల్‌గా ఉన్న వారి వివరాలను కూడా ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఒక గొప్ప భరోసా పథకమని, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని పేర్కొన్నారు.అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో సుమారు పదిహేడువందల కు పైగా రేషన్ కార్డులు ఉండగా, ఇప్పటివరకు దాదాపు ఆరు వందల మంది వివరాల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన అర్హులైన కుటుంబాలు కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన తమ వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రజల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఇలాంటి మంచి పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతిరోజూ గ్రామంలో క్యాంపెయినింగ్ నిర్వహిస్తూ ప్రజలకు వివరంగా అవగాహన కల్పిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. ప్రతి అర్హత గల కుటుంబం ఈ పథకం పరిధిలోకి వచ్చేలా గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి యాకుబ్, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు యువత పాల్గొన్నారు.