
పయనించే సూర్యుడు న్యూస్ :దశాబ్ద కాలంగా పులులను లెక్క కట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగిస్తుంది ఎన్టీసీఏ. 2014 లో తొలిసారిగా ఎన్టీసీఏ వన్యప్రాణుల లెక్కింపులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలను ఉపయోగించింది. వీటి ఆదారంగా పులి కదలికలు స్పష్టంగా గుర్తించే అవకాశం రావడంతో ఇదే పరిజ్ఞానాన్ని దేశమంతటా విస్తరించింది.పులి.. ఈ పేరు వింటే చాలు వెన్నులో వణుకుపుడుతుంది. అడవికి రాజుగా ఠీవిగా కదిలే పులి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమే. కానీ ఈ లెక్కలను సరిగ్గా పాటిస్తే పులి లెక్క పక్కాగా చెప్పవచ్చు అంటోంది ఎన్టీసీఏ.. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ- ఎన్టీసీఏ) త్వరలోనే దేశవ్యాప్తంగా పులులను లెక్కించబోతోంది. 16 పెద్దపులి ఆవాస రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అన్ని అడవుల్లో నాలుగేళ్లకోసారి ఈ గణన జరుగుతుంది. పులులతో పాటు ఇతర వన్యప్రాణులను కూడా లెక్కిస్తుంది ఎన్టీసీఏ.అయితే వన్యప్రాణుల లెక్కను ఎలా తెలుసుకుంటారు.. వాటిని లెక్క కట్టేందుకు ఎలాంటి సాంకేతికతను ఉపయోగిస్తారు.. వాటి గణాంకాలను ఎలా సేకరిస్తారు. చిక్కవు దొరకవు అన్నట్టుగా సంచరించే క్రూరమృగాల లెక్కలను ఎలా పక్కాగా చెప్తారో ఈ కథనంలో తెలుసుకుందాం.. 2022 లెక్కల ప్రకారం భారత్‌లో దాదాపు 3,682 పులులు ఉన్నాయని తేలింది. ప్రపంచంలో ఉన్న మొత్తం పులుల్లో ఇది దాదాపు మూడు వంతులు. మరి కొన్ని వేల కిలోమీటర్ల అడవుల్లో ఉన్న పులులను మన దేశం ఎలా లెక్కిస్తోంది..? ఆ లెక్కను ఎలా పక్కగా చెప్తుంది..? అంటే ఇదిగో ఈ కింది పద్దతులను ఉపయోగించే..అభయారణ్యంలో ఐదు పద్ధతుల్లో క్రూర మృగాలు, వన్య ప్రాణుల గణాంకాలను సేకరిస్తారు నిపుణులు. వాలంటీర్ల సాయంతో అటవి సిబ్బంది సహకారంతో నిపుణుల బృందం జంతు గణన ను పక్కాగా లెక్కిస్తారు. అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బంది నడక మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తే, వెంటనే వాటి గుర్తులతో పాటు ఏ ప్రదేశంలో ఎంత సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుంటారు. ఇది ఒక పద్దతి. ఏ పద్దతిలోనైనా జంతువుల పాదముద్రల సేకరణనే కీలకం. అడుగుల జాడ తోనే అది ఏ వన్యప్రాణి అనేది కనుగొంటారు. ప్రపంచంలో ఎన్ని వైల్డ్‌లైఫ్ సర్వేలు జరిగినా, వాటిలో అతిపెద్దది మన దేశంలో జరిగే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (AITE). దాదాపు 4 లక్షల చదరపు కిలోమీటర్ల అడవిలో, 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో, 60 వేల మంది ఫారెస్ట్ సిబ్బంది ఏకమై, ఒక సంవత్సరం పాటు ఈ సర్వే చేస్తారు. 2022 లెక్కల ప్రకారం భారత్‌లో దాదాపు 3,682 పులులు ఉన్నాయని తేలింది. ప్రపంచంలో ఉన్న మొత్తం పులుల్లో ఇది దాదాపు మూడు వంతులు. వేల కిలోమీటర్ల అడవుల్లో ఉన్న పులులను మన దేశం ఎలా లెక్కిస్తోంది? 2026లో జరగబోయే తర్వాతి టైగర్ సెన్సస్‌ని ఎలా చేపడుతారో మరింత వివరంగా తెలుసుకుందాం.. పులుల లెక్కింపులో మొదటి దశ ఏడు రోజులు జరుగుతుంది. అందులో మూడు రోజులు.. ఫీల్డ్ స్టాఫ్ సుమారు 15 కిలోమీటర్లు నడవాలి (రోజుకు 5 కిలోమీటర్ల చొప్పున అన్న మాట). ఇందులో సిబ్బంది పులులను నేరుగా చూడాలని ప్రయత్నించరు. వాటి ఆనవాళ్లను మాత్రమే వెతుకుతారు. పాద ముద్రలు, జంతువులను వేటాడి చంపిన చోటు, స్క్రాప్ మార్క్స్, చివరికి వాటి విసర్జితాల వంటి వాటిని సేకరిస్తారు. ఇందులో ప్రదానంగా పాదముద్రల ఆధారంగా పులుల లెక్కను తెలుసుకుంటారు. పులుల లెక్కలు సైతం పగ్ మార్క్ విధానంలోనే ఎక్కువ శాతం నిర్దారిస్తారు. అడవిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ పులుల పాదముద్రలను గుర్తిస్తారు. మెుదట ఒక గాజుపలకపై స్కెచ్ పెన్‌తో పాదముద్ర ఆకారాన్ని గీస్తారు. తర్వాత గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చూస్తారు. నేలపై పాదముద్ర చుట్టూ ఓ రింగ్‌ను ఏర్పాటు చేసి పాదముద్రపై చాక్ పౌడర్ చల్లుతారు. తర్వాత రింగ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని వేస్తారు. 15 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం గడ్డ కట్టి పాదముద్ర అచ్చులా ఏర్పడుతుంది. అలా వచ్చిన పాదముద్ర ఆదారంగా దాని వయసెంత అని ఓ నిర్దారణకు వస్తారు. పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించారన్నది పక్కాగా నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనే దాన్ని బట్టి పులి వయసును ఫైనల్ గా నిర్దారిస్తారు.
మలం సేకరణ.. మరో విధానం.. జంతుగణనలో భాగంగా అడవిలో సంచరించే సమయంలో మలాన్ని సేకరిస్తారు. అది ఏ జంతువుదో ముందుగా నిర్దారణకు వచ్చి వాటిని సిలికాన్ జెల్ ఉన్న డబ్బాలో భద్ర పరుస్తారు. ప్రముఖంగా పులుల మలాన్ని సేకరించేందుకు మక్కువ చూపుతారు. అలా సేకరించిన మలాన్ని సిలికాన్ జెల్ ఉన్న డబ్బాలో పెట్టి హైదరాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)’కి పంపుతారు. అక్కడ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్యతో పాటు వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు నిపుణులు.
చెట్లపై గోళ్ల గుర్తుల ఆనవాళ్లతో.. పులులు తమ ఇలాకా అని మరో పులిని తమ టెరిటోరియల్ లోకి రాకుండా అడ్డుకునేందుకు చెట్లపై తన పంజాతో వార్నింగ్ ఇస్తుంటాయి. చెట్లపై మూత్ర విసర్జన చేసి ఇది నా సరిహద్దు అనే సంకేతాన్ని మరో పులికి చేర వేస్తుంటాయి. అడవి జంతువులు సైతం చెట్లకు, రాళ్లకు పాదాలను, శరీరాన్ని రుద్దుతుంటాయి. గోళ్లు పెరిగినప్పుడు వాటిని తగ్గించుకునేందుకు, శరీరంపై దురదను పోగొట్టుకునేందుకు ఇలా చేస్తుంటాయి. అప్పుడు వాటి వెంట్రుకలు, గోళ్లు ఊడి పడిపోతుంటాయి. అటవీ సిబ్బంది చెట్లు, రాళ్లపై పడ్డ గాట్లను పరిశీలించి అక్కడ సంచరించిన జంతువు ఏదో గుర్తిస్తారు. వాటిని సేకరించి డీఎన్ఏ పరీక్ష చేసి ఆ జంతువు ఏదన్నది నిర్ధరిస్తారు. ఫీల్డ్ వర్క్ పూర్తయ్యాక రెండో దశ మొదలవుతుంది. దీనిని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII), డెహ్రాడూన్ నిర్వహిస్తుంది. 2006 నుంచి WIIనే ఈ సెన్సస్‌కి సాంకేతిక సాయం అందిస్తోంది. మొదటి దశలో అందిన డేటాను WII, రిమోట్ సెన్సింగ్ ఇన్ఫర్మేషన్తో కలిపి చూస్తుంది. శాటిలైట్ ఇమేజెస్ నుంచి అటవీ విస్తీర్ణం, పర్వతాలు, నీటి వనరులు, మనుషుల కార్యకలాపాలు వంటి డేటాను తీసుకుంటారు. తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లో పులుల కదలికల కోసం నైట్ మూవ్‌మెంట్‌ను కూడా ట్రాక్ చేస్తారు. దీని ద్వారానే పులులు ఎక్కడ తిరుగుతాయో సరిగ్గా తెలిసి కెమెరా ట్రాపింగ్కి లొకేషన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ దశ పూర్తిగా టెక్నాలజీతో కూడుకున్నది. ఇక్కడ పులులను వాటి చారల ఆధారంగా గుర్తిస్తారు. లెక్కింపు కోసం 4 చదరపు కిలోమీటర్లని ఒక గ్రిడ్‌గా విభజిస్తారు. ప్రతి గ్రిడ్‌లో రెండు కెమెరాలు సెట్ చేస్తారు. మొదటి దశ నుంచి వచ్చిన ఆనవాళ్ల ఆధారంగా, పులులు ఎక్కువగా తిరిగే దారులు, నీటి గుంటలు, కొండ ప్రాంతాలలో కెమెరాలు పెడతారు. దాదాపు 25 రోజులు కెమెరాలను ఫీల్డ్‌లో ఉంచుతారు. సిబ్బంది 48 గంటల గ్యాప్ ఇచ్చి కెమెరా మెమరీ కార్డ్స్ మార్చి, డేటా కలెక్ట్ చేస్తారు. చివరికి ఒక స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ సాయంతో పులుల పక్కన ఉండే చారలను మ్యాచ్ చేసి అవి ఏ పులికి చెందినవో గుర్తిస్తారు.
కెమెరా ట్రాప్స్ :దశాబ్ద కాలంగా పులులను లెక్క కట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగిస్తుంది ఎన్టీసీఏ. 2014 లో తొలిసారిగా ఎన్టీసీఏ వన్యప్రాణుల లెక్కింపులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలను ఉపయోగించింది. వీటి ఆదారంగా పులి కదలికలు స్పష్టంగా గుర్తించే అవకాశం రావడంతో ఇదే పరిజ్ఞానాన్ని దేశమంతటా విస్తరించింది. ప్రస్తుతం ట్రాప్ కెమెరాలను అమర్చి పులుల లెక్కను పక్కాగా కనుగొంటోంది ఎన్టీసీఏ. ఈ ట్రాప్ కెమెరాలను వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో ఎదురెదురుగా చెట్లకు అమరుస్తారు. ఒకటి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఉండే విధంగా చెట్లకు అమరుస్తారు. వన్యమృగాల కదలికలను ఈ కెమెరాలు 24 గంటలూ మానిటర్ చేస్తుంటాయి. చీకట్లో సైతం వన్య మృగాల కదలికలను గుర్తించేలా ఫ్లాష్ ఉపయోగించి ఫొటోలు సైతం తీస్తుంటాయి. వీటిలో ఉండే చిప్ ల ఆధారంగా వాటిలో నమోదైన సమాచారాన్ని రోజూ రోజూ సేకరిస్తారు అటవిశాఖ సిబ్బంది. అలా సేకరించిన ఫోటోలను ల్యాబ్ గా పంపిస్తారు. ఫోటోల్లోని జంతువుల ఎత్తు, చారలు, నడకను పరిగణనలోకి తీసుకొని వాటి సంఖ్యను లెక్కగడతారు నిపుణులు. 2018-19 పులుల గణన సమయంలో, భారతదేశంలో దాదాపు 27,000 కెమెరా ట్రాప్లను ఉపయోగించారు. ఇవి 34 మిలియన్లకు పైగా చిత్రాలను తీసుకున్నాయి. వాటిలో 76,651 చిత్రాలు పులులవే. ఇది ఆ ఏడాది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ పైన చెప్పిన ఐదు పద్దతుల్లో సేకరించిన లెక్కలను పూర్తి ఆధారాలతో సహా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ని భారత వన్యప్రాణి సంస్థ (డబ్ల్యూఐఐ)కు పంపించడం.. డబ్ల్యూఐఐ అందించే నివేదిక ఆధారంగా ఎన్టీసీఏ సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమాచారాన్ని చేర వేయడం.. అలా వచ్చిన సమాచారాన్ని ఆ శాఖ పార్లమెంటుకు చేరవేయడం.. నాలుగేళ్లకు ఓ సారి క్రమం తప్పకుండా సాగుతూనే ఉంది. అలా వన్యప్రాణులు, క్రూర మృగాల లెక్క తేలుతుంది. ఇంత కష్టపడితే కానీ పులుల గణన, వన్య ప్రాణుల లెక్క పక్కాగా తేలదు. 2006 లో దేశ వ్యాప్తంగా 1411 పులులుండగా.. 2014 నాటికి దేశవ్యాప్తంగా పులుల సంఖ్య రెండింతలుగా పెరిగింది. 2006 లొ ఎన్టీసీఏ లెక్కల ప్రకారం పులుల సంఖ్య 1,411గా ఉండగా, 2010 నాటికి 1,706కు, 2014 నాటికి 2,226కు చేరినట్లు తెలింది. ఇటు తెలంగాణాలోను పులుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు ఎన్టీసీఏ గుర్తించింది. తాజాగా జరిగే పులుల గణనతో తెలంగాణాలోని కవ్వాల్, అమ్రాబాద్ అభయారణ్యాల్లో బెబ్బుల లెక్కా మరింత పక్కగా తేలనుంది.