
పయనించే సూర్యుడు న్యూస్ :తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అని చెప్పి షాకిచ్చారు ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి. తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ మంచు వారి వారసురాలు.. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడానికి ఏ మాత్రం సంకోచించరు. బోల్డ్ కామెంట్స్ చేయడంతోపాటు సమాజంలో జరిగే పలు విషయాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తుంటారు మంచు లక్ష్మి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల సంఘటనను బయటపెట్టారు.కేవలం 15 ఏళ్ల వయసులో జరిగిన ఈ దారుణ అనుభవం ఆమె మనసుపై ఇప్పటికీ ముద్ర వేసి ఉందని ఆమె వెల్లడించారు. “నేను ఎప్పుడూ సొంత వాహనంలోనే ప్రయాణించేదాన్ని. కానీ ఒకసారి పదో తరగతి హాల్ టికెట్ల కోసం స్కూల్ యాజమాన్యం పబ్లిక్ బస్సులో తీసుకెళ్లింది. ఆ బస్సులో ఒక వ్యక్తి అసభ్యంగా నన్ను తాకాడు. నేను పూర్తిగా షాక్ అయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు” అని చెప్పారు. ఆ క్షణంలో కలిగిన భయాన్ని తాను ఇప్పటికీ వెంటాడుతున్నాయని తెలిపారు.సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన తనకే ఇలాంటి ఘటన జరిగితే, రోజూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే సామాన్య యువతులు, మహిళలు ఎంతటి భయానక పరిస్థితులు ఎదుర్కొంటారో ఊహించడం కష్టమని మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. “చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి వేధింపులు జరుగుతాయి. కానీ భయం, సిగ్గు, సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచనతో నోరు మూసుకుని భరిస్తారు” అని బాధపడ్డారు.ఈ అనుభవాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని, సురక్షిత భావాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. అందరూ ఈ సమస్య పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యాసంస్థలు, కుటుంబాలు, సమాజం అందరూ కలిసి బాలికల రక్షణకు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలను ఎదుర్కొన్నవారు నిశ్శబ్దంగా ఉండకూడదు, ధైర్యంగా బయటకు చెప్పాలని కోరారు.మంచు లక్ష్మి పబ్లిక్‌గా చేసిన ఈ కామెంట్లు మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయని గుర్తుచేశారు. ఈ సమస్యను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని ఆమె కోరారు.