
సాక్షి డిజిటల్ న్యూస్ :- అందరూ చూస్తుండగానే ఆ విద్యార్థిని లెక్చరర్ ను చెప్పుతో కొట్టింది. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన విజయనగరంలోని ఓ కళాశాలలో జరిగింది. కలకలం రేపింది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన వద్ద ఉన్న ఫోన్ తీసుకున్నందుకు ఆగ్రహించిన ఆ విద్యార్థిని.. తిట్ల దండకం అందుకుంది. చివరకు చేయి చేసుకునే స్థాయికి దిగజారింది. దీంతో అక్కడున్న విద్యార్థులు, అధ్యాపకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే వారిని విడిపించే ప్రయత్నం చేశారు. అయినా సరే సదరు విద్యార్థిని వెనక్కి తగ్గలేదు. అయితే ఈ ఘటన ఎందుకు జరిగింది? తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే.. ఒక విద్యార్థిని తన చెప్పుతో లెక్చరర్ చెంప పగలగొట్టడం అనేది చిన్న విషయం కాదు. వీడియోలో ఉన్న దృశ్యాలను చూస్తే.. సదరు విద్యార్థిని తన ఫోన్ విలువ 12000 అని వాదిస్తూ మహిళా లెక్చరర్ ను దూషించింది. ఆపై తన చెప్పుతీసి టీచర్ను కొట్టడానికి ప్రయత్నించింది. అయితే సదరు మహిళా టీచర్ ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ గొడవ జరుగుతున్నంతసేపు వీడియో తీసిన అక్కడ ఉన్నవారు సోషల్ మీడియాలో పెట్టారు. విజయనగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇటువంటి ఘటన ఎక్కడ జరిగినా తప్పిదమే. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. గురువును దైవంతో చూసే సమాజం ఇది. అటువంటి చోట ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. అత్యంత బాధాకరం కూడా. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుల పట్ల కనీస గౌరవం చూపకపోవడం అత్యంత హేయం. విద్యార్థుల్లో పెరుగుతున్న మొండితనం, సహనం లేకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తల్లిదండ్రుల వ్యవహార శైలి పై విమర్శలు వస్తున్నాయి. తమ పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాకుండా.. మంచి ప్రవర్తన, పెద్దల పట్ల గౌరవం వంటి విలువలను కూడా నేర్పాల్సిన అవసరం ఉంది అని అందరూ అభిప్రాయ పడుతున్నారు.
కింద లింక్ క్లిక్ చేసి వీడియో చూడండి
https://twitter.com/DrSrinubabu/status/1914593570910322781?s=20