
పయనించే సూర్యుడు, నవంబర్ 20( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
సిరిసిల్ల–సిద్దిపేట శివారులోని జక్కాపూర్ వద్ద గురువారం జరిగిన భయానక రోడ్డు ప్రమాదం స్థానికులను షాక్‌కు గురిచేసింది. తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామానికి చెందిన జడల తిరుపతి అక్కడికక్కడే మృతిచెందగా, అతని భార్య రజిత తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే బంధువుల మరణదినానికి హాజరయ్యేందుకు తిరుపతి దంపతులు బైకుపై సిద్దిపేట ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుండి సిరిసిల్ల వైపు వస్తున్న కారు రాంగ్ రూట్లోకి దూసుకురావడంతో బైకును ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగం తీవ్రంగా ఉండటంతో తిరుపతి సంఘటనా స్థలం వద్దే ప్రాణాలు కోల్పోయాడు. రజిత పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ ప్రమాదంతో మండెపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. స్థానికులు రాంగ్ రూట్లో వచ్చిన కారు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
