
పయనించే సూర్యుడు న్యూస్ :మరో మూడు రోజుల్లో పెళ్లి చేసుకోబోయిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించకుంటే, జరగబోయే పెళ్లిని అడ్డుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురం పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్‌నగర్‌లో నివాసముంటున్న పారంద శ్రీకాంత్(32) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అస్తుల క్రయవిక్రయాల క్రమంలో హయత్‌నగర్‌కు చెందిన నలుగురు వ్యక్తుల నుంచి రూ.2లక్షలు వరకు అప్పు చేశారు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, తిరిగి చెల్లించలేకపోయాడు. అయితే నవంబర్ 23వ తేదీన శ్రీకాంత్‌కు వివాహం నిశ్చయమైంది. ఇదే సమయంలో ఒత్తిడి తీసుకువస్తే డబ్బులు వస్తాయని భావించిన అప్పులిచ్చిన వ్యక్తులు.. తరచూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పరువు పోతుందని భావించిన శ్రీకాంత్.. తన చావుకు కారణమంటూ నలుగురు పేర్లు తెలియజేస్తూ.. సెల్పీ సూసైడ్ లో పేర్కొన్నాడు. గురువారం (నవంబర్ 20) తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనను మానసికంగా వేధించిన సత్యనారాయణ, సుబ్బారావు, అప్పం శేఖర్, ఐతగోని శేఖర్ లను విడిచి పెట్టొద్దని వీడియో తీసి వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. అనంతరం కనిపించకుండాపోయాడు.కుటుంబ సభ్యులు శ్రీకాంత్ జాడ కోసం వెతకగా.. హరిహరపురం చెరువు కట్టపై విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. శ్రీకాంత్ పురుగుల మందు తాగి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.