
పయనించే సూర్యుడు న్యూస్ :దేవుని ప్రసాదం అంటే భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేవునికి నివేదించిన ప్రసాదం కొంచెం దక్కినా దానిని ఎంతో భక్తితో స్వీకరిస్తారు. అలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు అక్రమార్కులు. స్వీటుషాపులో విక్రయించే సాధారణ స్వీటులా బయటివారికి విక్రయిస్తూ అడ్డదారిలో సొమ్ము చేసుకుంటూ.. దేవుని సొమ్ముకి గండి కొడుతున్నారు. ధర్మమూర్తిగా కొలిచే భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి ఆలయంలోని అధికారులే ఈ అధర్మానికి పాల్పడుతున్నారు. అంతేకాదు కేజీకి ఐదు కేజీలు ఉచితం అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. భద్రాచలం రామాలయంలో భద్రతా పరమైన కారణాలతో ఇటీవల ఎస్పీఎఫ్ సిబ్బంది నిఘాను పెంచారు. ఈ క్రమంలో రామాలయం వంటశాలనుంచి సిబ్బంది ఓ పెద్ద హాట్ బాక్స్‌ను తీసుకెళ్తుండగా గుర్తించారు. వెంటనే వారిని ఆపి తనిఖీ చేయగా ఆ హాట్ ప్యాక్‌లో చక్కెర పొంగలిని గుర్తించారు. దానిని తూకం వేయగా ఏకంగా 32 కేజీలు ఉంది. దీంతో అనుమానం వచ్చిన ఎస్పీఎఫ్ అధికారులు ఆరా తీశారు. ఓ భక్తుడు 5 కేజీల చక్కెర పొంగలి కావాలని 2 వేల రూపాయలు చెల్లించారని, 5 కేజీలకు బదులుగా ఏకంగా 32 కేజీల చక్కెర పొంగలి పంపిస్తున్నారని తేల్చారు. భద్రాచలం ఆలయంలో అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా జరుగుతున్నట్టు గుర్తించారు. కొంతకాలంగా ఓ భక్తుడు నామమాత్రంగా రుసుము చెల్లించి అధిక మొత్తంలో చక్కెర పొంగలి తీసుకెళ్లి హోటళ్లు, బయట శుభకార్యాలకు విక్రయిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. సాధారణంగా భక్తులు ఆలయంలో 400 రూపాయలు చెల్లిస్తే.. ఆ రోజు చక్కెర పొంగలిని తయారుచేసి.. స్వామివారికి నివేదించి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. కానీ, 2 వేల రూపాయలకి.. ఏకంగా 32 కేజీల మంచి క్వాలిటీతో కూడిన ప్రసాదాన్ని బహిరంగంగా అమ్ముకోవటం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే చేశామంటూ సమర్ధించుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో జరుగుతున్న ఈ అక్రమాలను అడ్డుకోవాలని భక్తులు కోరుతున్నారు.