
పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరారు. జోహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నవంబర్ 22 నుంచి 23 వరకు జరగనున్న 20వ జీ20 నాయకుల సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సదస్సు ప్రత్యేకమైనందని, ఆఫ్రికాలో జరగనున్న మొదటి జీ20 సమావేశం అవుతుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ మేరకు 2023లో భారతదేశ జీ20 అధ్యక్షత సమయంలో ఆఫ్రికన్ యూనియన్ను పూర్తి సభ్య దేశంగా చేర్చుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇది సమ్మిళితత్వం, గ్లోబల్ సౌత్‌కు భారత్ నిబద్ధత అని చెప్పారు.ఇందులో భాగంగా, గ్లోబల్ సౌత్ దేశంలో జరుగుతున్న జీ20 సదస్సులో మూడు సెషన్లలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధానంగా సమగ్ర ఆర్థిక వృద్ధితో పాటు స్థిరమైన, వాణిజ్యం, వాతావరణ మార్పులు, అరుదైన ఖనిజాలు, ఆహార వ్యవస్థలు, కృతిమ మేధస్సు వంటి అంశాలపై మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భాగస్వామ్య దేశాల నాయకులతో చర్చలు, దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయ ప్రవాసులను కలవడానికి తాను ఎదురుచూస్తున్నట్లు ప్రధాని చెప్పారు. కాగా, 2016, 2018, 2023లో మునుపటి పర్యటనల తర్వాత ప్రధాని మోదీకి దక్షిణాఫ్రికాకు నాలుగో అధికారిక పర్యటన అవుతుందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ఏడాది సమైక్యత, సమానత్వం, సుస్థిరత, ప్రపంచ సమస్యలపై చర్చించడానికి ఇది అవకాశంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు వంటి దార్శనికతకు అనుగుణంగా భారత్ తన దృక్పథాన్ని అందజేస్తుందని ఆయన తెలిపారు.