
పయనించే సూర్యుడు నవంబర్ 21,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాలలోని స్థానిక సెయింజోసెఫ్ పాఠశాల ఆవరణలో రెండు రోజులపాటు జరిగే 'రీజినల్ స్పోర్ట్స్ కల్చరల్ ఫెస్ట్' శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని, సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు ఉద్దేశించిన ఈ ఫెస్ట్ నవంబర్ 21, 22 తేదీలలో నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై, ఇంటర్స్కూల్ క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాంతీయ స్థాయిలో వివిధ పాఠశాలల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొననున్నారు. ఈ రెండు రోజుల్లో ఇంటర్స్కూల్ స్పోర్ట్స్ (క్రీడలు) మరియు డ్యాన్స్ కాంపిటీషన్ (నృత్య పోటీలు) నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ క్రీడలు మరియు కళల పట్ల విద్యార్థులను ప్రోత్సహించడం, వారి శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని సూచించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన ట్రోఫీలు, పతకాలు మరియు ప్రశంసా పత్రాలు బహుకరించారు. అనంతరం నిర్వాహకులు మంత్రి ఫరూక్ గారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ సుపీరియర్స్ సీనియర్ టి.జాక్యలీన్, కరసాండెంట్ సీనియర్ ఆనిజెసింతా, రెవరెండ్ ఫాదర్ కె.డి. జోసఫ్, వివిధ జిల్లాల సిస్టర్స్, ఉపాద్యాయులు, పీటీలు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
