
పయనించే సూర్యుడు న్యూస్ :భారతీయ యానిమేషన్ రంగానికి కొత్త దారులు చూపించి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘మహావతార్ నరసింహా’. తాజాగా ఈ సినిమా మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపును పొందింది. మహావిష్ణువు అవతారమైన నరసింహుడి పురాణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించారు. నరసింహుడి ఉగ్రరూపం, విజువల్ గ్రాండియర్‌తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిన కథనం.. ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టాయి. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల తర్వాత అంచనాలు మించి దూసుకెళ్లి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. నరసింహుడి ఎలివేషన్ సీన్స్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. సన్నివేశాలకు తగ్గట్టుగా ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో గూస్బంప్స్ తెప్పించిందని సోషల్ మీడియాలో రివ్యూలు వెల్లువెత్తాయి.తాజాగా ‘మహావతార్ నరసింహా’ మరొక అంతర్జాతీయ మైలురాయిని సాధించింది. అదేంటంటే రాబోయే 98వ అకాడమీ అవార్డ్స్ లో యానిమేషన్ కేటగిరీకి ‘మహావతార్ నరసింహా’ అధికారికంగా ఎంపికైనట్లు సమాచారం. ఈ విభాగంలో పాప్ డీమన్ హంటర్స్, ఇన్ఫినిటీ కాస్టెల్, ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ పొందిన డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా వంటి చిత్రాలు కూడా పోటీలో ఉన్నాయి. ఈ జాబితాలో ఒక భారతీయ యానిమేటెడ్ మూవీ చోటు దక్కడం ఇండస్ట్రీ మొత్తానికి గర్వ కారణమని చెప్పాలి.మరి సినిమా అవార్డు గెలుచుకుంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే. ఆస్కార్ నామినేషన్ దశ వరకూ చేరటం కూడా భారత యానిమేషన్ రంగానికి ఓ పెద్ద విజయంగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ గుర్తింపు భారతీయ స్టూడియోలకు మరింత నమ్మకం, ఉత్సాహాన్ని అందిస్తాయని అందరూ భావిస్తున్నారు. మైథలాజికల్ యానిమేషన్ స్టోరీలను కూడా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టగల శక్తి మన దగ్గర ఉందని ‘మహావతార్ నరసింహా’ ఘనంగా నిరూపించింది. భారతీయ యానిమేషన్ భవిష్యత్తుకు ఇది కొత్త రూట్ మ్యాప్ లాంటి విజయం అని అభిమానులు భావిస్తున్నారు.