
పయనించే సూర్యుడు నవంబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండల పరిధిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల పోచారం పాఠశాలలో శుక్రవారం నాడు భారతదేశం గర్వించే భౌతిక శాస్త్రవేత్త సి.వి రామన్ (చంద్రశేఖర్ వెంకట రామన్)137వ. జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు మాట్లాడుతూ 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచునాపల్లి సమీపంలో అయ్యన్ పెటాయి గ్రామంలో జన్మించారని, చిన్నతనంలోనే విజ్ఞానం పట్ల ఆసక్తిని కనబరిచారని, 1907లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయుడని,1930వ సంవత్సరం ఆసియాలో విజ్ఞాన శాస్త్రం రంగంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి సి.వి.రామన్ అని తెలిపారు.అలానే పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు డిఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ సి.వి.రామన్ విజ్ఞాన శాస్త్ర రంగానికి చేసిన కృషిని గుర్తించి 1954లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్నను ఇచ్చి సత్కరించిందని, రామన్ ఎఫెక్ట్ ఎప్పటికీ శాస్త్రీయ పరిశోధనలో ఒక మైలురాయిగా నిలిచిందని,సివి రామన్ ముఖ్యంగా కాంతి స్వభావం, కణాల విస్తృత పరిశోధన ద్వారా శాస్త్ర సామ్రాజ్యాన్ని విస్తరించారని వారి సేవలను కొనియాడారు.జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 28న జరుపుకుంటారని వారు తెలిపారు.సి.వి. రామన్ ను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ తరం విజ్ఞాన శాస్త్ర రంగంలో కొత్త పుంతలు తొక్కాలని విద్యార్థులను కోరారు.కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ బి.రవి ఉపాధ్యాయులు భూక్య రవి,ఎం.చందర్రావు, వి.రమేష్, జె.నాగేశ్వరరావు,హరియా నాయక్, సింగ్యా, ఉష శ్రీ, సౌందర్య, విద్యార్థులు పాల్గొన్నారు.